Rupee Bond Market: భారతదేశంలో స్థానిక కరెన్సీ రూపాయి బాండ్ మార్కెట్.. ఇటీవలి కాలంలో గణనీయమైన పెరుగుదలను చూసిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం పరిమితంగా ఉందని సూచనలు ఇవ్వడంతో ఈ మార్కెట్ ఊపు తగ్గే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది. 2025 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారతీయ సంస్థలు స్థానిక కరెన్సీ బాండ్ల ద్వారా రికార్డు స్థాయిలో 6.6 ట్రిలియన్ రూపాయలు ($77.1 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది గత సంవత్సరం కంటే 29% అధికం. ఈ ఉధృతికి ప్రధాన కారణం RBI విరివిగా తీసుకున్న లిక్విడిటీ ఇంజెక్షన్ చర్యలు, వడ్డీ రేట్ల తగ్గింపులు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
RBI ఈ ఏడాది వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల కార్పొరేట్ రుణ జారీకి ఊతం లభించింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. 2020 ఏడాది తర్వాత తమ అత్యల్ప ఖర్చుతో బాండ్ జారీ చేసింది. అదానీ గ్రూప్ కు చెందిన పోర్ట్ యూనిట్స్.. కార్డు స్థాయిలో నిధులు సమీకరించుకోగలిగాయి. ముఖేష్ అంబానీకి చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్ తమ తొలి బాండ్‌ను సైతం విజయవంతంగా జారీ చేసింది. తక్కువ వడ్డీ రేట్లు మరియు విరివిగా లభించే లిక్విడిటీ కారణంగా చాలా సంస్థలు విదేశీ మార్కెట్లలో రుణాలు తీసుకునే బదులు స్థానిక రూపాయి బాండ్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నాయి. టిప్సన్స్ గ్రూప్ డైరెక్టర్ జిగర్ వైశ్నవ్ ప్రకారం.. బాండ్ ఫండ్ రైజింగ్ గురించి గతంతో పోలిస్తే పలు సంస్థలు ఆరా తీయడం పెరిగింది.
Also Read: Triple R Project: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వం కీలక హామీ!
అయితే RBI తన ద్రవ్య విధానాన్ని “అకమ్మోడేటివ్” నుండి “న్యూట్రల్” గా మార్చడం.. వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశం పరిమితంగా ఉందని సూచించడం వంటి చర్యలు రూపాయి బాండ్ జారీ ఊపును తగ్గించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, దేశీయ ఆర్థిక వృద్ధి మందగమనం కారణంగా కార్పొరేట్ బాండ్ అమ్మకాలు రెండవ ఆర్థిక సంవత్సరంలో తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. RBI తాజా సంకేతాల నేపథ్యంలో కొన్ని సంస్థలు బాండ్ల జారీ కంటే.. బ్యాంకు ద్వారా రుణాలను సమీకరించుకోవడానికే మెుగ్గు చూపే ఛాన్స్ ఉంది.