Block Widow Case: భార్య, భర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా జీవిత భాగస్వాములను కిరాతకంగా చంపుతున్నారు. అయితే ఇరాన్ లో ఓ మహిళ ఏకంగా 11 మంది భర్తలను దారుణంగా చంపి యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆమె పేరు కుల్తుం అక్బారి (Kulthum Akbari). క్రమ పద్దతిలో భర్తలను హత్య చేయడంతో ఆమెకు ‘బ్లాక్ విడో’ (Black Widow) అనే బిరుదును సైతం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కేసును విచారిస్తున్న కోర్టు.. త్వరలో ఉరిశిక్ష కూడా విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ బ్లాక్ విడో కథ ఏంటి? ఆమె తన భర్తలను ఎందుకు చంపింది? ఆమె హత్యలు ఎలా బయటపడ్డాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
భర్తలను ఎలా చంపిందంటే?
ఇరాన్‌లో అత్యంత భయానకంగా హత్యలు చేసిన వారి జాబితాలో కుల్తుం అక్బారి ఎప్పటికీ ఉంటుంది. అక్బారి.. వయసు పైబడిన పురుషులను వరుసగా వివాహం చేసుకుని వారిని నెమ్మదిగా విషప్రయోగం చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. రక్తపోటు మందులు, నిద్రమాత్రలు, మధుమేహ మందులు, ఆల్కహాల్ వంటివి పరిమితికి మించి ఇవ్వడం ద్వారా వారిని 11 మంది భర్తలను ఆమె బలిగొన్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారంతా వృద్ధులు కావడంతో వారివి సహజ మరణాల్లా కనిపించాయి. అందువల్ల వారి బంధువులు, పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. చనిపోయిన భర్తల ఆస్తులు, కట్నాలు దండుకొని ఆ సొమ్మును తన కూతురు పేరు మీదకు మార్చాలని.. ఎక్కువ మెుత్తంలో సంపద కూడబెట్టాలని అక్బారి ఈ హత్యలకు పాల్పడింది.
Also Read: Khazana Jewellers Robbery: ఖజానా దోపిడి దొంగలు మామూలోళ్లు కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డీసీపీ!
ఎలా పట్టుబడిందంటే?
కుల్తుం అక్బారి.. 2000 సంవత్సరంలో తన హత్యల పరంపరను ప్రారంభించింది. ఇవి 2023 వరకూ కొనసాగాయి. చివరిగా జరిగిన 82 ఏళ్ల ఘొలాంరెజా బాబాయి (Gholamreza Babaei) మరణం తర్వాత అక్బారిపై అనుమానం వచ్చింది. తన స్నేహితుడి తండ్రిని కూడా విష ప్రయోగం చేసి అక్బారి చంపబోయిందన్న విషయం బాబాయి కుమారుడు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్బారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. 11 మంది భర్తలు సహా ఇప్పటివరకూ 15 మందిని అక్బారి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
Also Read: Viral Video: పూరి ఆలయంలో అద్భుతం.. జెండా పట్టుకున్న హనుమాన్.. వీడియో వైరల్!
ఉరిశిక్షకు రంగం సిద్ధం
ప్రస్తుతం అక్బారి ఇరాన్ విప్లవ కోర్టు (Iran’s Revolutionary Court)లో విచారణ ఎదుర్కొంటోంది. నేరం నిరూపితమైతే ఆమెకు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. కానీ ఆమె తరఫు న్యాయవాదులు, అక్బారి మానసిక సమస్యలతో బాధపడుతోందని అందుకే సైకియాట్రిక్ పరీక్ష చేయాలని కోర్టును కోరుతున్నారు. బాధితుల కుటుంబాలు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ‘ఇంత జాగ్రత్తగా పద్ధతిగా విషప్రయోగం చేసి హత్యలు చేసిన వ్యక్తి మానసిక రోగి కాదు’ అని వాదిస్తున్నారు. మెుత్తం మీద కోర్టు ఆమెకు ఉరిశిక్ష వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు.