BCCI: మన దేశంలో క్రికెట్‌ను ఎంత అమితంగా ఇష్టపడతారో కొత్తగా గుర్తుచేయాల్సిందేమీ లేదు. అంతగా ఆరాదించే ఈ స్పోర్ట్‌ను మన దేశంలో బీసీసీఐ (Board of Control for Cricket in India) నియంత్రిస్తుంది. అందుకే, బీసీసీఐలో (BCCI) పదవులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ మాట ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, బీసీసీఐలో 6 ఖాళీలు ఉన్నాయి. సీనియర్ పురుషుల జాతీయ సెలెక్షన్ కమిటీలో 2, మహిళల సెలెక్షన్ ప్యానెల్‌లో 4 ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది.
అర్హతల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతేడాది అనుసరించిన షరతులే వర్తిస్తాయని వెల్లడించింది. దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు అంతర్జాతీయ స్థాయిలో 7 టెస్టులు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడివుండాలని, లేదా, కనీసం 10 వన్డేలు (ఇంటర్నేషనల్) లేదా 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉండాలని ప్రకటనలో బీసీసీఐ స్పష్టం చేసింది.
సెలెక్టర్లకు సంబంధించిన కాంట్రాక్టులను ప్రతి ఏడాది పునరుద్ధరిస్తారని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న సెలక్టర్లలో ఎవరి స్థానంలో కొత్త వారిని నియమించుకుంటారనేది ఇంకా నిర్ణయించలేదు. ఆ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని సదరు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం పురుషుల సెలెక్షన్ కమిటీకి టీమిండియా మాజీ క్రికెటర్ అజిత్ ఆగార్కర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు సెలక్షన్ కమిటీలో మరో నలుగురు సభ్యులు ఉన్నారు. ఎస్‌ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆసియా కప్ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది ఈ కమిటీయే.
జూనియర్ సెలక్షన్ కమిటీలో కూడా..
జాతీయ జట్టుకు ఆటగాళ్ల ఎంపికకు సంబంధించిన కమిటీతో పాటు, బీసీసీఐ మరో కీలక ప్రకటన కూడా చేసింది. అండర్-22 వరకూ, అంటే పురుషుల జూనియర్ సెలెక్షన్ కమిటీలో కూడా ఒక సభ్యుడు కావాలని బీసీసీఐ కోరింది. క్యాంపులు, టూర్లు, టోర్నమెంట్ల కోసం జూనియర్ లెవల్ ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఎంపిక చేయబోయే సభ్యుడి పాత్ర ‘చీఫ్ సెలక్టర్’ కూడా కావొచ్చని స్పష్టం చేసింది.
అదేవిధంగా, మహిళల జాతీయ సెలెక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న 4 పోస్టులు కూడా భర్తీ చేయనున్నామని, ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుత కమిటీలో నీతూ డేవిడ్ (చైర్‌పర్సన్), రెను మార్గరేట్, ఆరతి వైద్య, కల్పనా వెంకటాచార్, శ్యామా డే షా కొనసాగుతున్నారు. గత మంగళవారం (ఆగస్టు 20) ఈ కమిటీ సమావేశమైంది. వచ్చే నెల నుంచి భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించింది. కాగా, అన్నీ రకాల పోస్టులకు దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేది సెప్టెంబర్ 10 అని బీసీసీఐ స్పష్టం చేసింది.