India Squad: ఆసియా కప్-2025లో (India Squad) ఆడబోయే భారత జట్టు ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ప్రకటన వచ్చేసింది. క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఊహించని విధంగా, అనూహ్యమైన ఎంపికలతో సెలక్టర్లు జట్టు కూర్పు (Team India for Asia Cup) చేశారు.
టీమిండియా ఆసియా కప్ టీమ్ ఇదే
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా. ఈ మేరకు 15 మంది సభ్యులతో బీసీసీఐ సెలక్టర్లు టీమ్‌ని ప్రకటించారు.
Read Also- Sudershan Reddy: ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి ఎంపిక
స్టాండ్‌బై ప్లేయర్లు వీళ్లే..
ప్రసిద్ధ్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
ఊహించని నిర్ణయాలు
టీమ్ వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యంగా మారింది. నిజానికి అసలు గిల్‌ను ఎంపిక చేయకపోవచ్చంటూ కొన్ని రోజులుగా విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ వైఎస్ కెప్టెన్‌గా సెకల్టర్లు ఎంపిక చేశారు. ఇక, శ్రేయాస్ అయ్యర్‌ను టీమ్‌లోకి తీసుకుంటారని భావించినా అది జరగలేదు. యశస్వి జైస్వాల్ విషయంలో కూడా అదే జరిగింది.
అయ్యర్‌కు అన్యాయం?.. అగార్కర్ ఏమన్నారంటే..
శ్రేయస్ అయ్యర్‌కు ఆసియా కప్ జట్టులో చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, అయ్యర్‌కు మళ్లీ అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయ్యర్‌కు చోటుదక్కకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. ‘‘ఎవరి స్థానంలో చోటివ్వాలి? ఇది అయ్యర్ తప్పుకాదు, అదేవిధంగా మా తప్పు కూడా కాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘యశస్వి జైస్వాల్ విషయంలో నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి. అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు బౌలింగ్ కూడా చేయగలడు. వీరిద్దరిలో ఒకరిని తప్పకుండా తప్పించాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ ఎదురైంది. అందుకే, అయ్యర్‌ను పక్కకు పెట్టకతప్పలేదు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నారు.
వైస్ కెప్టెన్‌గా గిల్ ఎందుకు?
టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌ను టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్-2025కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. గిల్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది శ్రీలంక పర్యటనలో అని, ఆ సమయంలో అతడు జట్టుకు వైఎస్ కెప్టెన్‌గా ఉన్నాడని, తదుపరి టీ20 వరల్డ్ కప్ కోసం జట్టు సైకిల్‌ను అక్కడి నుంచి మొదలుపెట్టామని, అందుకే గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. శ్రీలంక పర్యటన తర్వాత టెస్ట్ సిరీస్‌లతో గిల్ బిజీ అయ్యాడని, టీ20 ఫార్మాట్‌లో అవకాశం రాలేదని ప్రస్తావించాడు. తిరిగి ఇప్పుడు జట్టులో దక్కించుకోవడంపై సంతోషంగా ఉన్నామని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు.