Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఆలయ గోడలపై “I Love Mohammed” అనే గ్రాఫిటీ కనిపించడం పెద్ద వివాదానికి దారితీసింది. అయితే, ఆ గ్రాఫిటీలోని స్పెల్లింగ్ తప్పు ఈ కేసును ఛేదించడంలో పోలీసులకు కీలక ఆధారమైంది. ఇప్పటికి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అలీఘర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (SSP) నీరజ్ కుమార్ ప్రకారం, ఈ కేసులో దిలీప్ కుమార్, ఆకాష్, అభిషేక్ సరస్వత్, నిశాంత్ కుమార్ అనే నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నాడు.
భూ వివాదం వెనుక కుట్ర
దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, ఈ గ్రాఫిటీ ఘటన వెనుక భూ వివాదం ఉంది. నిందితులు తమ ప్రత్యర్థులను ఇరికించేందుకు ఆలయ గోడలపై రెచ్చగొట్టే రాతలు రాశారని పోలీసులు తెలిపారు. “భూ వివాదాల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు నిందితులు గ్రాఫిటీ రాసి కుట్ర పన్నారు,” అని SSP నీరజ్ కుమార్ వెల్లడించారు. స్పెల్లింగ్ లోపమే పోలీసులకు కీలక క్లూ గా మారింది. పోలీసులు “I Love Mohammed” అనే వాక్యంలో ఉన్న స్పెల్లింగ్ లోపాన్ని గమనించారు. ఇదే నినాదం గత నెలలో బరేలీలో ఉద్రిక్తతలకు దారితీసిన బ్యానర్లలో వేరే విధంగా రాయబడింది. దీంతో పోలీసులు ఆ రాత స్థానికుల చేత రాయబడలేదని అనుమానించారు. సీసీటీవి ఫుటేజ్, కాల్ రికార్డులు, మరియు ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన రెండు వేర్వేరు ఆస్తి వివాదాలతో ముడిపడి ఉంది. మొదటిది.. రాహుల్ మరియు గుల్ మొహమ్మద్ కుటుంబాల మధ్య పాత వివాదం. రెండవది.. ముస్తాకీమ్ కుటుంబం మరియు నిశాంత్ కుమార్ కుటుంబం మధ్య ఉన్న ఆస్తి తగాదా. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద, అలాగే క్రిమినల్ లా సవరణ (CLA) చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 25న, లోధా ప్రాంతంలోని భగవాన్‌పూర్, బులాకిఘర్ గ్రామాల్లో ఆలయ గోడలపై “I Love Mohammed” అనే రాతలు కనిపించాయి. దీంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. తర్వాత నిందితులు, తమ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ, లోధా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ప్రారంభంలో పోలీసులు ఫిర్యాదు నమోదు చేయడంలో వెనుకంజ వేయగా, స్థానిక నాయకుడి ఒత్తిడి కారణంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				