Uttam Kumar Reddy: 2024-25 సంవత్సరానికి పారా బాయిల్డ్ రబీ కోటా అదనపు కేటాయింపులు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సచివాలయంలో శనివారం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్ తోష్ అగ్నిహోత్రితో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పారా బాయిల్డ్ రైస్ (కేఎంఎస్ 2024-25 రబీ) అదనపు కేటాయింపు కోసం విజ్ఞప్తి చేశారు. కేఎంఎస్ 2024-25 కోసం కేంద్రం 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించింది. అయితే, 2024-25 రబీ నుంచి ఇప్పటివరకు 17.06 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్, 87 వేల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం సరఫరా చేశారు. ఇంకా 2.34 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్, 14.26 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఈ రబీలో పారా బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉంటుందని, కేఎంఎస్ 2024-25 రబీ కింద అదనంగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ కేటాయింపు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
రేక్ తరలింపు కొరత
పారా బాయిల్డ్ రైస్ తరలింపు కోసం అదనపు రేక్‌ల అవసరం ఉందని, ప్రస్తుత సంవత్సరం రేక్ తరలింపు గతేడాదితో పోలిస్తే 13.5 ఎల్ఎంటీల కొరత ఉందని మంత్రి ఎఫ్‌సీఐ సీఎండీకి వివరించారు. ఎఫ్‌సీఐ గోడౌన్లలో పారా బాయిల్డ్ బియ్యం నిల్వలు పేరుకుపోవడం వలన కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలు ఆలస్యం అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని ఎఫ్‌సీఐ డిపోల నుంచి పారా బాయిల్డ్ బియ్యం తరలింపును వేగవంతం చేయడానికి అదనపు రేక్‌లను వెంటనే కేటాయించాలని మంత్రి అగ్నిహోత్రిని కోరారు. ఖరీఫ్ 2024-25 కోసం సీఎంఆర్ బియ్యం సరఫరా వ్యవధిని పొడిగించాలని మంత్రి కోరారు. సీఎంఆర్ డెలివరీ సమయం నవంబర్ 12 నాటికి ముగిసిందని, వివిధ కారణాల వల్ల ఇప్పటికీ 2.27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్‌లో ఉందని తెలిపారు. అందువల్ల, సీఎంఆర్ డెలివరీల సమయం మరో 60 రోజులు పొడిగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: MP Raghunandan Rao: బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి.. ఎంపీ విజ్ఞప్తి
పీఈజీ పథకం పునరుద్ధరణ
తెలంగాణలో నిల్వ సామర్థ్యం పెంపుదల చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత నిల్వ సామర్థ్యం 65.00 ఎల్ఎంటీ ఉన్నప్పటికీ, ఎఫ్‌సీఐ అద్దెకు తీసుకోగల గోడౌన్ల రకంపై పరిమితులతో నిల్వ కొరతను ఎదుర్కొంటున్నామన్నారు. సంబంధిత నిల్వ పథకం కింద ఎఫ్‌సీఐతో అదనంగా 15 ఎల్ఎంటీల నిల్వ సామర్థ్యాన్ని మంజూరు చేయాలని కోరారు. 7 నుంచి 8 ఏళ్ల హామీతో ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రం మరిన్ని గోడౌన్లను నిర్మాణం చేయడానికి పీఈజీ (ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్యారెంటీ) పథకాన్ని పునరుద్ధరించాలని మంత్రి సూచించారు.
Also Read: Indian Railways: ఇండిగో ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా 89 స్పెషల్ రైళ్లు

