MP Raghunandan Rao: గ్రామాలకు కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వారు చేసే అభివృద్ధి ఏమీ ఉండదు
బీజేపీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) పిలుపునిచ్చారు. మెదక్ టీఎస్జీవో (TSGO) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని, గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే వస్తున్నాయనే విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేల దగ్గర నిధులు లేవని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ‘‘మీరు బీఆర్‌ఎస్ అభ్యర్థులమని చెప్పుకుంటే మీకు నిధులు వస్తాయో రావో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికే డబ్బులు లేవు. ఏమైనా నిధులు ఇవ్వాలనుకుంటే, 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) కింద కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఊర్లో ఒక సీసీ రోడ్డు వేయాలంటే, ఎన్ఆర్‌ఈజీఎస్ (NREGS – ఉపాధి హామీ పథకం) కింద భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇవ్వాలి’’ అని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
Read Also- Crocodile Captured: హమ్మయ్య.. ఎట్టకేలకు మొసలి చిక్కిందోచ్!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వద్ద నిధులు లేవు
మెదక్ పార్లమెంట్‌లో ఉన్న ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏమి చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వారికి రాదని రఘునందన్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే వారు కొత్తగా చేసేది ఏమీ ఉండదని, పదేళ్లు వాళ్లే అధికారంలో ఉన్నారని, అందినకాడికి తీసుకుపోయారని ఆరోపించారు. ‘డెవలప్‌మెంట్ చేయమంటే వాళ్ల గల్లీలోనే చేసుకున్నారు. ఎమ్మెల్యేకే ఐదు కోట్లు కూడా లేవు. ఐదు కోట్లు ఉంటే గ్రామానికి ఐదు, పది లక్షలైనా ఇచ్చేవారు, కానీ అది కూడా లేదు’ అని అన్నారు.
ప్రజలకు పిలుపు
గ్రామ పంచాయతీ ప్రజలకు ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నానని ఎంపీ రఘునందన్ పేర్కొన్నారు. ‘గ్రామ స్తంభాలకు ఉన్న లైట్లు, సీసీ రోడ్లు, నర్సరీలు, పరిశుభ్రత యంత్రాలు, స్మశాన వాటికలు, బాత్రూమ్‌లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చాయని మనందరికీ తెలుసు. కావున ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలి’’ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, శంకర్ గౌడ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Read Also- Minister Ponguleti: నోరుంది కదా అని తప్పుడు ప్రచారం చేయొద్దు: మంత్రి పొంగులేటి వార్నింగ్

