Crocodile Captured: సంగారెడ్డి జిల్లాలో సుమారు 20 రోజులుగా ప్రజలను భయపెట్టిన భారీ మొసలి
ఊపిరి పీల్చుకున్న ప్రజలు
మొసలిని స్వాధీనపరచుకున్న అటవీ అధికారులు
జోగిపేట, స్వేచ్ఛ: సంగారెడ్డి జిల్లాలోని (Sangareddy) అందోలు, అల్లాదుర్గం మండలాల పరిధిలో ఉన్న కన్‌సాన్‌పల్లి, పెద్దాపూర్ చెరువులలో తిరుగుతూ సాధారణ ప్రజలు, పశువుల కాపరులను, జంతువులను భయాందోళనలకు గురిచేసిన మొసలి ఎట్టకేలకు (Crocodile Captured) పట్టుబడింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వట్‌పల్లి మండలంలోని కేరూర్ గ్రామ శివారులో ఈ మొసలి పట్టుకున్నారు. మొసలిని అటవీ అధికారులు స్వాధీనపరచుకున్నారు. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
20 రోజులపాటు భయభ్రాంతులు
ఈ మొసలు సుమారు ఇరవై రోజుల క్రితం కన్‌సాన్‌పల్లి పెద్ద చెరువు వద్ద ఒడ్డుకు వచ్చి కనిపించింది. మరుసటి రోజు పక్కనే ఉన్న తిరుమం చెరువులో కూడా జనాల కంటపడింది. ఈ విషయాన్ని అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా, చెరువులలో నీరు నిండుగా ఉండడంతో మొసలిని పట్టుకోవడం సాధ్యం కాదని వారు తెలిపారు. దాంతో, అటువైపుగా వెళ్లాలంటే రెండు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు (Viral News) గురయ్యారు.
శుక్రవారం అర్ధరాత్రి పట్టివేత
శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో, సింగూరు కాలువలో నుంచి బయటకు వచ్చిన మొసలి.. కేరూర్ గ్రామ శివారులోని రోడ్డుపై వెళ్తుండగా కొందరి కంటపడింది. వెంటనే స్థానికులు వట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, స్థానిక పోలీసులు వెంటనే అటవీ అధికారులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న కేరూర్, కన్‌సాన్‌పల్లి గ్రామాల ప్రజలు మొసలి ఉన్న స్థలానికి చేరుకొని, అధికారులు వచ్చే వరకు అది ఎక్కడికీ వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసు, అటవీ ఇరు శాఖల అధికారులు అక్కడికి చేరుకుని మొసలిని పట్టుకుని తీసుకెళ్లారు. పట్టుబడిన భారీ మొసలిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐ లవకుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

