Hyderabad Crime Rate: ఈ ఏడాది 15శాతం నేరాలు తగ్గాయ్
సైబర్ నేరాల కట్టడిలో సత్ఫలితాలు
మహిళలు, చిన్నపిల్లలపై పెరిగిన నేరాలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: విజబుల్ పోలీసింగ్‌తో ఈ సంవత్సరం సత్ఫలితాలను సాధించామని హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఓవరాల్‌గా 15శాతం నేరాలు తగ్గాయన్నారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టటంలో కూడా మంచి ఫలితాలు వచ్చినట్టు తెలిపారు. అయితే, మహిళలు, చిన్నపిల్లల పట్ల నేరాలు పెరిగాయన్నారు. ఇది కాస్త ఆందోళన కలిగించే అంశమన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల్లో పకడ్భంధీ విచారణ జరిపించటం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా హైదరాబాద్ యాంటీ నార్కొటిక్ బ్యూరో విభాగంలో త్వరలోనే డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక వింగ్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దాంతోపాటు మరింత సమర్థవంతంగా నేరాలను నియంత్రించటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోనున్నట్టు చెప్పారు. దాంతోపాటు డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం కమిషనర్ సజ్జనార్ వార్షిక నేర నివేదికను (Hyderabad Crime Rate) విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా ఈసారి 30,690 రిజిష్టర్ అయినట్టు తెలిపారు.
మొత్తంగా చూస్తే నేరాల సంఖ్య తగ్గినా మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు సంబంధించి 6శాతం, పోక్సో యాక్ట్ ప్రకారం నమోదైన కేసుల్లో 27శాతం పెరుగుదల ఉందన్నారు. దీనిని సీరియస్ గా తీసుకోనున్నట్టు చెప్పారు. ఈ నేరాలను కట్టడి చేయటానికి షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేస్తామన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also- Football Match Funds: ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం వాడిన రూ.110 కోట్లపై ఎంక్వయిరీ చేస్తాం: హరీష్ రావు
భయపడుతున్నారు…
అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలు హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నారని కమిషనర్ సజ్జనార్ చెప్పారు. దీనికి కారణం విజబుల్ పోలీసింగ్…పటిష్టమైన సీసీ కెమెరాల నెట్ వర్క్ తోపాటు పాత నేరస్తుల కదలికలపై పటిష్టమైన నిఘా పెట్టటమే అని తెలిపారు.
తగ్గిన సైబర్ నేరాలు…
సైబర్ నేరాలకు చెక్ పెట్టటంలో ఈ సంవత్సరం సత్ఫలితాలు సాధించామన్నారు. రకరకాలుగా సైబర్ క్రిమినల్స్ చేస్తున్న మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించటం ద్వారా దీనిని సాధించామన్నారు. జాగృత్ హైదరాబాద్…సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రతీ మంగళ, శనివారాల్లో పోలీసులు ప్రజల వద్దకే వెళ్లి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రతీ ఇంట్లో ఓ సైబర్ సింబా ఉండేలా చూస్తున్నట్టు తెలియచేశారు. ఇది ఫలితాలనిస్తోందని చెప్పారు. క్రితంసారితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ నేరాలు 8శాతం మేర తగ్గాయన్నారు. అదే సమయంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని కటకటాల వెనక్కి పంపిస్తున్నట్టు చెప్పారు. దీని కోసం సైబర్ క్రైం విభాగం అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు కూడా జరుపుతోందన్నారు.
గత ఏడాది సైబర్ నేరాల్లో 511మందిని అరెస్ట్ చేస్తే ఈసారి 566మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఆశకు హద్దు ఉండదని చెబుతూ చాలామంది తేలికగా పెద్ద మొత్తాల్లో డబ్బు సంపాదించ వచ్చని సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో చిక్కి డబ్బు పోగొట్టుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్ మోసాల్లో కోట్ల రూపాయలు కోల్పోతున్నారని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలన్నా…ఆన్ లైన్ ట్రేడింగ్ చేయాలన్నా అధికారిక వెబ్ సైట్ల నుంచి మాత్రమే చేయాలని సూచించారు. తప్పితే టెలిగ్రాం, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి వచ్చే లింకుల్లో డబ్బు పెడితే డబ్బు పెట్ట వద్దన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి సైబర్ కేటుగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చ వద్దని చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాదిలో 120 మ్యూల్ అకౌంట్లను ఫ్రీజ్ చేయించినట్టు చెప్పారు.
Read Also- Ponguleti Srinivasa Reddy: అవినీతి లేని పాలనే లక్ష్యం.. అభివృద్ధిలో దూసుకుపోతాం.. మంత్రి పొంగులేటి
విదేశీ ఉద్యోగాల మోజులో…
విదేశీ ఉద్యోగాల మోజులో ఏజెంట్ల వలలో చిక్కుకోవద్దని కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఈ ఏజెంట్లు డబ్బు సంపాదన కోసం పెద్ద జీతాల్లో ఉద్యోగాలని చెప్పి కాండోడియా తదితర దేశాల్లోని సైబర్ క్రిమినల్స్ ముఠాల వద్దకు పంపిస్తున్నారన్నారు. ఆ గ్యాంగులు బలవంతంగా బాధితులతో సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు చెప్పారు.
డ్రగ్స్ పై ఉక్కుపాదం…
డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలని ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలో డ్రగ్ నెట్ వర్క్ పై కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. క్రితంసారి మాదక ద్రవ్యాలకు సంబంధించి 322 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 368 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. డ్రగ్స్ పెడ్లింగ్…వాడకాన్ని నిరోధించటానికి ఈగల్, డీఆర్ఐ, ఈడీ, ఎక్సయిజ్, ఎన్సబీ ఇలా అన్ని విభాగాలతో సమన్వయాన్ని కొనసాగిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ జోన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. డ్రగ్స్ నెట్ వర్క్ ను ఛిన్నాభిన్నం చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుల్లో డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ వారితోపాటు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వివరాలను రికార్డు చేసి పెట్టి వారిపై నిఘా కొనసాగిస్తున్నామన్నారు.
ప్రత్యేక బృందం…
ఇక, డ్రగ్స్ కేసుల్లో నిందితులను పట్టుకోవటం ఒక ఎత్తుగా ఉంటే ఆయా కేసుల్లో పకడ్భంధీగా దర్యాప్తు జరిపి వారికి శిక్షలు పడేలా చూడటం మరో ఎత్తుగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల్లో పకడ్భంధీగా విచారణ జరపటానికి త్వరలోనే హైదరాబాద్ యాంటీ నార్కొటిక్ బ్యూరో విభాగంలో డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
దొంగతనాల కేసుల్లో…
ఇక, దొంగతనాలను నిరోధించటంలో కూడా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్టు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దొంగతనాలు, దోపిడీలు, చోరీలు, బందిపోటు దోపిడీల నేరాల్లో రికవరీ శాతం పెరిగిందన్నారు. క్రితంసారి చోరీ అయిన సొత్తులో 46శాతం రికవరీ కాగా ఈ ఏడాది అది 61శాతానికి పెరిగిందని చెప్పారు. ఇక, గత ఏడాది 3,904 మంది నిందితులకు శిక్షలు పడగా ఈసారి 4,463మందికి శిక్షలు పడ్డాయన్నారు.
ట్రాఫిక్ నియంత్రణపై…
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలను తగ్గించటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అదే సమయంలో వితౌట్ హెల్మెట్, ట్రిపుల్ రైవింగ్, రాంగ్ రూట్ లో వాహనాలు నడపటంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఇలా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన 5,818మందిపై కేసులు నమోదు చేసి ఆయా కోర్టుల్లో ఛార్జీషీట్లు దాఖలు చేసినట్టు చెప్పారు. విస్తృతస్థాయిలో తనిఖీలు జరుపుతున్న నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20శాతం డ్రంకెన్ డ్రైవింగ్ నేరాలు తగ్గాయన్నారు.
మెమొరబుల్ గా చేసుకోండి…
న్యూ ఇయర్ వేడుకలను మెమొరబుల్ గా చేసుకోండి…మిజరబుల్ గా మార్చుకోకండి అని కమిషనర్ సజ్జనార్ సూచించారు. నాలుగు గోడల మధ్య డ్రగ్స్, మద్యం పార్టీలు చేసుకోవద్దన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వేడుకలు చేసుకోవాలని చెప్పారు. ఈ సంవత్సరం అన్ని ప్రధానమైన పండుగలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కగలకుండా ప్రజలు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. ముందు ముందు ఇలాగే సహకరించాలని కోరారు.
రోడ్ ఏ హెడ్…
వచ్చే సంవత్సరంలో శాంతిభద్రతలను మరింత మెరుగ్గా కాపాడేందుకు రోడ్ ఏ హెడ్ లో భాగంగా కొన్ని గోల్స్ ను పెట్టుకున్నట్టు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ పోలీసింగ్ ను అమలు చేస్తామన్నారు. ప్రిడెక్టీవ్ ఎనాలసిస్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్, డేటా విశ్లేషణ జరుపుతామన్నారు. అదే సమయంలో డ్రోన్లను విరివిగా ఉపయోగించనున్నట్టు తెలిపారు.

