Ponguleti Srinivasa Reddy: గత పదేళ్ల బీఆర్‌ఎస్ అరాచక పాలనకు స్వస్తి పలికి, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఆర్తి గార్డెన్ లో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీ విజయం కార్యకర్తల కష్టార్జితమని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి కొనియాడారు. “పదేళ్ల కాలంలో నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది” అని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అవినీతి రహిత పాలనే లక్ష్యం
ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి, రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని బీఆర్‌ఎస్ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల పేరుతో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టానికి దొరకాల్సిందేనని హెచ్చరించారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘భూ భారతి’ వంటి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.
Also Read: Delhi Murder Suicide: దేశంలో మరో ఘోరం.. సిగరేట్‌కు రూ.20 ఇవ్వలేదని.. భార్యను చంపిన భర్త
అభివృద్ధిలో దూసుకుపోతాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

