Nellore Man Killed in Attack: జమ్ము కాశ్మీర్ పహల్గాం జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) దేశంలోని ప్రతీ భారతీయుడ్ని కలిచి వేస్తోంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ ఉగ్రదాడి ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా పడింది. ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
నెల్లూరి వాసి హత్య
జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ (Somishetty Madhu Sudan)గా గుర్తించారు. ముష్కరులు ఆయన శరీరంలోకి ఏకంగా 42 బుల్లెట్లు (42 Bullets) దింపినట్లు సమాచారం. దీంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరోవైపు వైజాగ్ కు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) సైతం ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
మధుసూదన్ కు ఇద్దరు పిల్లలు
నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ తల్లిదండ్రులు సోమిశెట్టి తిరుపాలు (Somishetty Tirupal), పద్మావతి (Padmavathi) నివసిస్తున్నారు. మధుసూదన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూమార్తె మధు ఇంటర్ చదువుతుండగా.. కుమారుడు దత్తు 8వ తరగతి. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుసూదన్ కుటుంబంతో కలిసి తాజాగా జమ్ము కశ్మీర్ టూర్ కు వెళ్లారు. దురదృష్టవశాత్తు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కావలిలో విషాద చాయలు అలుముకున్నాయి.
మంత్రి నారాయణ సంతాపం
మరోవైపు ఉగ్రదాడుల్లో తమ జిల్లా వాసి చనిపోవడంతో మంత్రి నారాయణ (Minister Narayana) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధుసూదన్ మరణవార్త తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. అతడి బంధువులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మధుసూదన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం (AP Govt) అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. అలాగే ఉగ్రదాడిలో చనిపోయిన భారతీయులందరికీ మంత్రి సంతాపం తెలియజేశారు.
Also Read: Jammu Kashmir Terror Attack: కాశ్మీర్ దాడి ఇప్పుడే ఎందుకు? పాకిస్తాన్ ప్లాన్ ఏంటి?
పిరికిపంద చర్య: షర్మిల
జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) అన్నారు. ఈ దాడిలో 30 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తనను తీవ్రంగా కలిచి వేసినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడిలో మరణించిన వాళ్లలో తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరమని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా నిలబడాలని కోరారు.