Visakha Man Died In Attack: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. అనంత్ నాగ్ జిల్లాలో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు జరిపిన బీకర కాల్పుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల్లో విశాఖకు చెందిన ఓ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ సైతం ఉండటంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.
సరదాగా గడిపేందుకు వెళ్లి..
జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ లో జరిగిన ఉగ్రకాల్పుల్లో విశాఖకు చెందిన చంద్రమౌళి (Chandramouli) మృతి చెందారు. ఆయన బ్యాంక్ ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. చంద్రమౌళి తన భార్య నాగమణితో కలిసి సరాదాగా గడిపేందుకు ఈ నెల 18న జమ్ముకశ్మీర్ వెళ్లారు. మరో ఇద్దరు దంపతులతో కలిసి మెుత్తం ఆరుగురు కశ్మీర్ వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు తుపాకులతో విరుచుకుపడటంతో చంద్రమౌళి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా చంద్రమౌళి మృతదేహాన్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా విశాఖ కు తరలించారు.
స్థానికంగా విషాదచాయలు
బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ చంద్రమౌళి మృతితో ఆయన స్థానికంగా ఉంటున్న అపార్ట్ మెంట్ లో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని అపార్ట్ మెంట్ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేస్తూ చాలా సరదాగా ఉండేవారని పేర్కొంటున్నారు.
వెళ్లేముందు స్వీట్స్
రెండు సంవత్సరాల క్రితం ఫ్లాట్ కొని ఈ అపార్ట్మెంట్ కి వచ్చారని.. ప్రతీ ఒక్కరితో చాలా కలివిడిగా ఉండేరని అపార్ట్ మెంట్ సెక్రటరీ తెలిపారు. టూర్ కి వెళ్లే ముందు మొక్కలకు నీళ్లు పోయమని చెప్పారని వాచ్ మెన్ అన్నారు. తమ పిల్లలకు స్వీట్స్ కూడా ఇచ్చారని.. అటువంటి మంచి వ్యక్తి చనిపోవడం బాధకరమని వాచ్ మెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: AP 10th Class Results: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పదో తరగతి ఫలితాలు విడుదల.. మార్క్స్ ఇలా పొందండి!
హైదరాబాద్ వాసి మృతి
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కూడా ప్రాణాలు విడిచాడు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే మనీష్ రంజన్ కూడా ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. కుటుంబంతో కలిసి ఆయన కూడా ఇటీవల జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. బైసారన్ లో పర్యటిస్తున్న క్రమంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.