Tirumala Kalyanakatta: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల క్షేత్రానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో శ్రీవారి భక్తులు అసలు తిరుమలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజమేనా, కాదా అనే రీతిలో వివరాలు ఆరాతీస్తున్నారు. ఇదే ఘటన నిజమైతే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.. తిరుమల క్షేత్రానికి వచ్చిన భక్తులు స్వామి వారికి తరనీలాలు సమర్పించుకుంటారు. అయితే కళ్యాణ కట్టల వద్ద తలనీలాలు సమర్పించే సమయంలో మహిళా క్షురకురాలు తన ఎదురుగా ఉన్న మహిళా భక్తుల వద్ద గుండు చేయాలంటే వంద రూపాయలు కట్టాల్సిందేనంటూ డిమాండ్ చేసినట్లు ఆ వీడియో సారాంశం. తప్పనిసరిగా ₹100 చెల్లించాల్సిందేనంటూ సదరు మహిళా క్షురకురాలు తెలిపినట్లు వీడియోలో స్వరం సైతం వినిపిస్తోంది. అలాగే భక్తురాలు సైతం 100 రూపాయలు చెల్లించారు.
ఇంతకు ఈ వీడియోలో ఏ మేరకు వాస్తవం ఉందో లేదో కానీ ఉచితంగా తలనీలాల సమర్పణ కార్యక్రమాన్ని సాగించాల్సి ఉండగా సదరు మహిళా క్షురకురాలు 100 రూపాయలు అడిగినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒకరి వద్దనే ₹100 తీసుకుంటే వేల సంఖ్యలో వచ్చే శ్రీవారి భక్తుల వద్ద ఇలాంటి దోపిడీ ఎలా జరుగుతుందోనన్న ఊహాగానాలను శ్రీవారి భక్తులు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద ఈ వీడియో పై టీటీడీ పూర్తిస్థాయి విచారణ జరిపి ఈ వీడియో వాస్తవమా లేక ఉద్దేశపూర్వకంగా ఫేక్ ప్రచారం సాగిందా? అలాగే ఈ వీడియో తిరుమలకు సంబంధించిందేనా లేక వేరే ప్రాంతానికి సంబంధించిందా? ఇలాంటి అన్ని విషయాలను ఆరా తీసి వాస్తవమని తేలితే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులతో సహా నెటిజన్స్ కోరుతున్నారు. మరి టీటీడీ ఈ వీడియో పై ఎలాంటి స్పందన ఇస్తుందో వేచి చూడాలి.
Also Read: PSR Anjaneyulu Arrest: కాదంబరి జత్వాని కేసులో కీలక పురోగతి.. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్!
ఇది ఇలా ఉంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన సమయం నుండి తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఇటీవల ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల భక్తులు తస్మాత్ జాగ్రత్త అంటూ టీటీడీ కోరింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఉపేక్షించేది లేదని టీటీడీ హెచ్చరించింది.
తలనీలాలు తీయాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. నిలువు దోపిడీ!
తిరుమలలో తలనీలాలు తీయడానికి ఓ మహిళ ఉద్యోగి 100 రూపాయిలు అడుగుతున్న వీడియో ఓ వ్యక్తి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.
ఇలాంటి వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోరా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. pic.twitter.com/nFteUaRDEv— ChotaNews App (@ChotaNewsApp) April 22, 2025