Wines Bandh: తెలంగాణలో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల్లో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబులకు షాక్ ఇస్తూ నేటి నుంచి తొలి విడత పోలింగ్ ఫలితాలు వచ్చేవరకూ ఆయా పంచాయతీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. దీంతో పోలింగ్ జరిగే గ్రామాల్లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి.
మూడ్రోజుల పాటు బంద్..
తెలంగాణ పంచాయతీ తొలి విడత పోలింగ్ ను 189 మండలాల్లోని 4,236 గ్రామాలు, వాటి పరిధిలోని 37 వేల వార్డులకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సవ్యంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎలక్షన్ కమీషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగే గ్రామాల్లోని వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, బెల్ట్ షాపులను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేసింది. మద్యం విక్రయించే ఇతల లైసెన్స్డ్ సంస్థలకు సైతం ఈ ఆంక్షలు వర్తిస్తాయని SEC స్పష్టం చేసింది. దీంతో ఇవాళ (డిసెంబర్ 9) సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న పోలింగ్ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం ఉండనుంది.
12,728 గ్రామాల్లో ఎన్నికలు
తొలి విడత తరహాలోనే మరో విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో విడత పోలింగ్ 14వ తేదీన, మూడో విడత డిసెంబర్ 17వ తేదీన జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగనుంది. గంట గ్యాప్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మెుదలు కానుంది. అదే రోజు గెలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఈ మూడు విడతల్లో పోలింగ్ జరగనుండటం గమనార్హం.
Also Read: Kriti Height: హీరోల హైట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్.. అంటే మహేష్ బాబు కూడా!
ఎన్నికల సంఘం దిశానిర్దేశం..
డిసెంబర్ 11 నుంచి మెుదలు కానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలను 3 విడతలలో నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

