Thummala Nageswara Rao: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి, కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 1) ఒక్కరోజులోనే రాష్ట్రానికి 9,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందని.. ఇవాళ (సెప్టెంబర్ 2) మరో 5,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి రానున్నాయని అన్నారు.
27,470 మెట్రిక్ టన్నుల యూరియా
రాష్ట్రానికి తరలిస్తున్న యూరియా.. రైల్వే రేక్ పాయింట్లయిన సనత్ నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వీటితో పాటు వచ్చే వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని తెలిపారు. ఈ ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్ కు అనుగుణంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశారు.
Also Read: Uttar Pradesh: బాలికను వెంటాడుతున్న పాము.. 40 రోజుల్లో 9 సార్లు కాటు.. అంతుచిక్కని మిస్టరీ!
పంట నష్టంపై 5 రోజుల్లో రిపోర్ట్
రైతులకు ఎరువుల కొరత ఉండకుండా, అవసరమైన చోట తక్షణమే అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని 5 రోజుల్లోపు పంటనష్టంపై పూర్తి నివేదికను పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల సంక్షేమం, వారి పంటల రక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రిగారు పునరుద్ఘాటించారు.
Also Read: PM Modi: నా తల్లిని తిట్టారు.. నన్ను అవమానించారు.. ప్రధాని ఎమోషనల్
యూరియా కోసం పడిగాపులు
ఖరీఫ్ లో సాగు చేస్తున్న పంటలకు ఎరువులు వేసుకునేందుకు ఆశించిన స్థాయిలో యూరియా దొరకకపోవడంతో రెండు నెలలుగా రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉంటోంది. ఈ క్రమంలోని జోగులాంబ గద్వాల జిల్లాకు ఖరీఫ్ పంటలకు గాను 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని భావించి ఆ మేరకు ఇండెంట్ వచ్చినా సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పి ఎ.సి.ఎస్, ఆగ్రో సెంటర్ల చుట్టూ తిరుగుతూ యూరియా ఎప్పుడొస్తుందని అధికారులను అడిగే పరిస్థితులు దాపురించాయి. ప్రతిరోజు టోకెన్ల కోసం వస్తుండగా స్టాక్ లేదని చెబుతున్నడంతో రైతులు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిరసన చేపట్టారు. టోకెన్ల కోసం ఏకంగా క్యూలైన్ లో గంటల తరబడి నిలుచుండే బదులు తమ చెప్పులను పెట్టి నిరసన తెలిపారు.