Ramchander Rao: టీబీజేపీలో అంతర్గత పరిణామాలు సెగలు పుట్టిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణను ధిక్కరిస్తూ, అంతర్గత విషయాలను బయటపెడుతున్న లీకు వీరులపై రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌తో భేటీ అయిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సొంత పార్టీలోని అసమ్మతి నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వారిపై కమలం రథసారథి నిప్పులు చెరిగారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని కొందరు కావాలనే బయటకు పొక్కనిస్తున్నారని, దీనివల్ల కేడర్‌లో అయోమయం నెలకొంటోందని ఆయన మండిపడ్డారు. పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందే. లీక్ వీరులు భవిష్యత్తులో వీక్ కాక తప్పదంటూ అల్టిమేటం జారీ చేశారు.
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు
రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలం పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా పార్టీలోని కొందరు అగ్రనేతలను ఉద్దేశించే ఆయన ఈ పంచ్ డైలాగులు పేల్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లీక్ రాయుళ్లపై ఇప్పటికే ఒక కన్నేసి ఉంచామని, సరైన సమయం చూసి కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వంతో భేటీ తర్వాతే రాంచందర్ రావు ఈ స్థాయిలో స్పందించడం గమనార్హం. పార్టీ అంతర్గత వ్యవహారాలపై హైకమాండ్ సీరియస్‌గా ఉందని, క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరి రాష్ట్ర అధ్యక్షుడి సీరియస్ వార్నింగ్‌తో లీక్ వీరులు సైలెంట్ అవుతారా? లేక ఏదైతే అదవుతుందని తమ పంథాను కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాలి.
Also Read: Alleti Maheshwar Reddy: వాళ్లంతా కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
జేపీ నడ్డాతో రాంచందర్ రావు భేటీ
హస్తిన పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా(Jahath Prakash Nadda)ను కలిశారు. తెలంగాణ(Telangana)లో ఇటీవల రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలపై ఇరువురు చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయని, ప్రజల్లోకి వెళ్లాలని ప్రజా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నడ్డా.. రాంచందర్ రావుకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అలాగే బీఆర్ఎస్(BRS).. కుటుంబ కలహాలతో ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని, కాంగ్రెస్(Congress) వైఫల్యాల కారణంగా రాష్ట్రంలో బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారని, రాజకీయపరమైన పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించినట్లు రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగి అధికారంలోకి వస్తుందని, అందుకోసం కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేయాలని.., ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని నడ్డా రాంచందర్ రావుకు సూచించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయంగా సర్పంచులు వార్డ్ మెంబర్లు గెలవడంపై నడ్డా.. స్టేట్ చీఫ్ కు అభినందనలు తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, పార్టీ విజయానికి కృషి చేసినందుకు వారికి నడ్డా.. ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇదిలాఉండగా సోమవారం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ ను టీబీజేపీ చీఫ్ కలిసిన విషయం తెలిసిందే.

