Villages Development: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ సూక్తిని నిజం చేస్తూ, పల్లెలు అభివృద్ధి బాట పట్టినప్పుడే దేశం పురోగమిస్తుంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ద్వారా కొలువుదీరిన నూతన పాలకవర్గాలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. పల్లెల అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లతో పాటు పంచాయతీల సొంత వనరుల ద్వారా సమకూరుతాయి. ఈ నిధులను సక్రమంగా, పారదర్శకమైన ప్రణాళికలతో వినియోగించినప్పుడే ఆయా గ్రామాలు ఆదర్శవంతంగా తీర్చిదిద్దబడతాయి.
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పథకాలు
గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కీలక భూమిక పోషిస్తాయి. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఏటా నాలుగు విడుతలుగా ఈ నిధులను విడుదల చేస్తుంది. దీనికి తోడు ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ద్వారా పారిశుధ్య నిర్వహణకు, ‘ప్రధాన మంత్రి సడక్ యోజన’ కింద బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు అందుతాయి. ముఖ్యంగా ‘జల జీవన్ మిషన్’ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేస్తుంది. వికసిత్ భారత్ గ్రామ్ పథకం ద్వారా చేపట్టే సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఇంకుడు గుంతల వంటి పనులకు నిధులు కేటాయించబడతాయి.
Also Read: Roads Development: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వచ్చే ఏడాది నుండి విమాన కార్గో సేవలు..!
రాష్ట్ర ఆర్థిక సంఘం, సొంత వనరులు
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జనాభా నిష్పత్తిని బట్టి క్రమం తప్పకుండా గ్రాంట్లు విడుదల చేస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయంలో ‘స్టాంప్ డ్యూటీ’ వాటాను పంచాయతీలకు బదిలీ చేస్తుంది. ప్రభుత్వ గ్రాంట్లతో పాటు, పంచాయతీలు తమ పరిధిలోని వనరుల ద్వారా ‘సాధారణ నిధులు’ సమకూర్చుకోవచ్చు. గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లపై విధించే పన్నులు, కొత్త ఇంటి నిర్మాణ అనుమతుల రుసుములు పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటాయి. ఈ సొంత నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం నేరుగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
ప్రణాళికాబద్ధమైన ఖర్చు.. నిరంతర పర్యవేక్షణ
పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయిని పాలకవర్గం పక్కా ప్రణాళికతో వినియోగించాల్సి ఉంటుంది. కార్యాలయ నిర్వహణ, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనం పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు ఖర్చు చేయాలి. ఈ నిధుల వినియోగంలో ఏవైనా అవకతవకలు జరిగితే సర్పంచులు తమ పదవులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిట్ల ద్వారా నిధుల జమ ఖర్చులను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. పారదర్శకమైన పాలనతో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

