Illegal parking: ఒకపక్క రహదారి విస్తరణ పనులు.. మరో పక్క పార్కింగ్ లేకుండా వ్యాపారాలు
ట్రాపిక్ గుగుప్పిట్లో ప్రజలు
మేడ్చల్, స్వేచ్ఛ: మేడ్చల్‌లో (Medchal News) ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగిపోతోంది. రహదారి విస్తరణ పనుల కారణంగా రోడ్డు కూచించుకు పోవడం ఒక కారణమైతే, ఎలాంటి పార్కింగ్ లేకుండా (Illegal parking) వ్యాపార, వాణిజ్య సంస్థలు జాతీయ రహదారి వెంట తమ కార్యకలాపాలను కొనసాగిస్తుండడం రెండో కారణంగా ఉంది. మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి మొదలుకొని ఆత్వెల్లి వరకు జాతీయ రహదారి పొడవున ఉన్న హార్డ్వేర్లు, హోటల్స్, ఆస్పత్రులు, వివిధ రకాల దుకాణాలు పూర్తిస్థాయిలో పార్కింగ్ లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. వినియోగదారులు జాతీయ రహదారి ఆనుకొని, అవసరమైతే పైకి వచ్చి పార్కింగ్ చేయడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అసలే విస్తరణ పనుల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుంటే పార్కింగ్ లేని వ్యాపారాల కారణంగా ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. బస్టాండ్‌కు సమీపంలో ఉన్న ఒక ఆసుపత్రి జాతీయ రహదారి పక్కన, ఆసుపత్రిని ఆనుకొని వెళ్లే రోడ్డుపైన పార్కింగ్‌ను నిర్వహిస్తుంది.
Read Also- Gajwel – BRS: పార్టీ ఫండ్ చిచ్చు.. గజ్వేల్ బీఆర్ఎస్‌లో లుకలుకలు!.. ఎక్కడివరకు దారితీసిందంటే?
అలాగే అదే రోడ్డులో ఉన్న దుకాణదారులు సైతం తమ వాహనాలను అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. అక్కడే యూ-టర్న్ ఉండడంతో కిష్టాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఎక్కువమంది ఈ దారిని వినియోగిస్తున్నారు. ఇరువైపులా ఉన్న పార్కింగ్ కారణంగా యూ-టర్న్ తీసుకొని కిష్టాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారు. అలాగే పట్టణంలోని వివేకానంద రోడ్డు, మార్కెట్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పార్కింగ్ లేని దుకాణాల నిర్వహణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి వాహనదారులు ముందుకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సమయం వృధా అవుతుంది. రోడ్డు నడుచుకుంటూ వెళ్లేవారు సైతం ప్రాణాలు వారి చేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేడ్చల్లో రోజురోజుకి తీవ్రమైతున్న ట్రాఫిక్ సమస్యపై అధికారులు స్పందించి, పైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పార్కింగ్ లేకపోవడం వల్లే సమస్య: మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్
మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై వాహనదారులు ఇష్టానుసారం వాహనాలను నిలపడంతో ట్రాఫిక్ సమస్య వస్తుందని మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్ తెలిపారు. వాహన దారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను ఆపాలని ఆయన సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్ వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నట్టు తమ దృష్టికి రాలేదని ఒకవేళ పార్కింగ్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read Also- School Bus Accident: మరో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. 60 మందికి పైగా విద్యార్థులు..!

