Bhoodan scam: భూమిలేని నిరుపేదల చేతుల్లో ఉండాల్సిన భూదాన్ భూములు బడాబాబుల చేతుల్లో బందీ అయ్యాయి. అక్రమాలకు అధికారులు సైతం సహకరించి రికార్డులు తారుమారు చేశారు. నిబంధనలను పక్కకు పెట్టి వేరొకరికి పట్టాలుగా మార్చి భూదాన్ భూములను ఏమార్చారు. రూ.కోట్లు విలువ చేసే భూములను భూ బకాసురులు అనుభవిస్తుండగా..బాధిత రైతుల గోస అరణ్యరోదనే అవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 21,939 ఎకరాల భూదాన్ భూములు ఉండగా..అందులో వేలాది ఎకరాల భూములు అక్రమార్కుల చెరలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారంలో వెలుగులోకి వచ్చిన భూదాన్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిసుండగా..ఫోరెన్సిక్ ఆడిట్ జరిపితే జిల్లా వ్యాప్తంగా కనుమరుగై పోయిన వేల ఎకరాల భూదాన్ భూముల లెక్క తేలనున్నది.
ఇష్టారాజ్యంగా భూముల ధారాదత్తం:
‘ధరణి’లోని లొసుగులను ఆసరగా చేసుకుని జిల్లాలో చాలామంది అధికారులు ఇష్టారాజ్యంగా భూదాన్ భూములను ధారాదత్తం చేశారు. తహసిల్దార్, ఆర్డీవోలు మొదలుకుని జిల్లా కలెక్టర్లు సైతం ఈ అక్రమతంతులో భాగస్వామ్యులయ్యారు. చట్టం ప్రకారం అమలు చేయాల్సిన నిర్ణయాలను ఇష్టమొచ్చినట్లుగా చేశారు. భూదాన్ బోర్డు నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ తీసుకోకుండానే ఏకపక్షంగా భూ బదలాయింపులు చేశారు. అధికారుల ఉల్లంఘనలు..సామాన్యులకు శాపంగా మారుతున్నాయి. భూదాన్ భూములను ధరణి పోర్టల్‌లోని నిషేధిత జాబితా(ప్రొహిబిటెడ్ మాడ్యూల్)లో చేర్చి సంరక్షించాల్సి ఉండగా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. దీంతో ఆయా భూములు నిషేధిత జాబితా వెలుపలే కన్పించడంతో చేతులు మారాయి. పేదలకు పంపిణీ చేసిన భూములు సైతం బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21,99 ఎకరాల భూదాన్ భూములు ఉండగా..అందులో 13,574 ఎకరాల భూమిని అసైన్ చేశారు. వీటిల్లో చాలా వరకు భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అసైన్ చేసిన భూముల్లో ఎటువంటి క్రయవిక్రయాలు చేపట్టరాదన్న నిబంధన ఉన్నప్పటికీ బడా బాబులు కొనుగోలు చేసి వెంచర్లు చేశారు. ఎన్వోసీలు పొంది ప్లాట్ల క్రయ విక్రయాలు జరిపారు.
అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి:
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కంటే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. రెవిన్యూ అధికారులు భూదాన్ భూములను రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం మారాక..బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి సైతం భూ అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విచారణకు ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించడంతో భూదాన్ భూముల అక్రమ వ్యవహారాలు అక్కడక్కడా వెలుగులోకి వచ్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారం గ్రామ సర్వే నెం.181లోని 42.33 ఎకరాల భూదాన్ భూమి పలువురు రియల్టర్లు, ప్రజా ప్రతినిధులకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేటతెల్లం అయింది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి సేల్ డీడ్లు చేయించుకున్నారన్న అభియోగంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ లపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ సూత్రధారిగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో దీనిపై ప్రస్తుతం ఈడీ సైతం విచారణ జరుపుతోంది.
Also Read: Balanagar Crime: సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని.. చిన్నారిపై అఘాయిత్యం!
ఇదే నియోజవర్గంలోని కందుకూరు మండల తిమ్మాపూర్‌లో సర్వే నెంబర్లు 6/1, 147, 167/1, 167/9, 453/454, 444, 573, 574, 575, 455, 576, 129, 130, 161లలో 111.11 భూదాన భూములు ఉండగా..అందులో 39.18 ఎకరాల భూములు కాలక్రమేణా ధరణిలో పట్టా భూములుగా మారాయి. గత ప్రభుత్వ పెద్దలకు చెందిన బినామీల పేరుతో క్రయవిక్రయాలు సైతం జరిగాయి. ఈ భూముల విలువ సుమారు రూ.200కోట్ల వరకు ఉంటుంది. తిమ్మాపూర్‌లోని భూదాన్ భూములను స్వాహా చేసేందుకు 2008లోనే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న కిషన్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు. ఆతర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆయా భూములు పట్టాలుగా మారి చేతులు మారాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రస్తావించడంతో ఈ భూ బాగోతంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి:
భూదాన్ భూముల దోపిడీ ఒక్క మహేశ్వరం మండలానికే పరిమితం కాలేదు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, యాచారం, కందుకూరు, హయత్ నగర్, మొయినాబాద్, గండిపేట మండలాల్లో కోకొల్లలుగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. యాచారం మండలం తాటిపర్తిలో 250 ఎకరాల భూదాన్ భూములను భూసేకరణలో కలిపేయడమే కాకుండా.. ఆయా భూములపై అనర్హులు పరిహారం పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లిపురం సర్వే నెం.17లో 60 ఎకరాలు, బాట సింగారంలోని సర్వే నెం.319లో 13 ఎకరాలు, తారామతిపేట సర్వే నెం.215, 216, 217లో 59.10 ఎకరాలు, పాపాయిగూడలోని సర్వే నెం.219, 224లలోని 82.39 ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ సర్వే నెం.132, 447, 449, 450, 453లలో, పోరండ్ల సర్వే నెం.17లోని భూదాన్ భూములు చాలా వరకు మాయం అయ్యాయి.
Also Read: Kavitha Letter: కవిత మరో షర్మిల.. లేఖ వెనక సీఎం రేవంత్.. మెదక్ ఎంపీ
ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలోని సర్వే నెం.51, 52, 53లో 30 ఎకరాలు సైతం ఇతరుల పేరిట భూ మార్పిడి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలోనూ భూదాన్ దందా జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెం.186, 187, 188, 189లలో సుమారు 30 ఎకరాల వరకు భూదాన్ భూములు ఉన్నాయి. ఇందులో కొంతమందికి అసైన్ చేసి పట్టాలిచ్చి ఆతర్వాత రద్దు చేశారు. ప్రస్తుతం ఆయా భూములను బడా లీడర్లకు, పలు కంపెనీలకు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా..కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్లు ఎవరికివారుగా ఇష్టానుసారంగా..క్లియరెన్స్ ఇచ్చి భూదాన్ భూములను మాయం చేశారన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ భూముల అన్యాక్రాంతంపై నజర్ పెట్టి ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా 2017కి ముందు 2014 తర్వాత ఉన్న భూదాన్ భూముల లెక్కతేల్చి అక్రమాలను బట్ట బయలు చేయాలని ప్రజానీకం కోరుకుంటున్నది.