Fake ID People Arrested: నకిలీ గుర్తింపు కార్డులతో భారతీయ పౌరులుగా చలామణి అవుతున్న నలుగురు రోహింగ్యాలను ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్వోటీ అధికారులు హయత్ నగర్ పోలీసుల సహాయంతో అరెస్టు చేశారు. నిందితుల నుంచి పలు డాక్యుమెంట్లతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మయన్మార్‌కు చెందిన మహ్మద్ అర్మాన్, మహ్మద్ రుమానా అక్తర్, మహ్మద్ నయీం 2011లో అక్రమంగా భారత సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించారు. 2014లో మహ్మద్ అర్మాన్ మంచాల్‌లో మీ సేవా సెంటర్ నిర్వహిస్తున్న మహ్మద్ హ్యారిస్ అలియాస్ మహ్మద్ రిజ్వాన్ సహాయంతో ఆధార్ కార్డు పొందాడు.
Also Read: CI Suspended: రక్షక భటుడు రాక్షసుడయ్యాడు.. మహిళపై సీఐ లైంగిక వేధింపులు!
ఆ తర్వాత మిగిలిన ఇద్దరు నిందితులు రుమానా అక్తర్, నయీం కూడా ఇదే తరహాలో తప్పుడు వివరాలతో ఆధార్ కార్డులు సంపాదించారు. 2016లో మయన్మార్‌కు చెందిన షోయబ్ మాలిక్ కూడా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి వీరికి కలిశాడు. వీరంతా అడ్డదారుల్లో సంపాదించిన ఆధార్ కార్డులు, పాన్ కార్డుల సహాయంతో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు. వీరంతా పెద్ద అంబర్‌పేటలో నివాసం ఏర్పరుచుకున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్వోటీ అదనపు డీసీపీ షాకీర్ హుస్సేన్ పర్యవేక్షణలో ఎల్బీనగర్, మహేశ్వరం ఎస్వోటీ అధికారులు హయత్ నగర్ పోలీసులతో కలిసి మహ్మద్ అర్మాన్, మహ్మద్ రుమానా అక్తర్, మహ్మద్ నయీం, మహ్మద్ హ్యారిస్‌లను అరెస్టు చేశారు.
మరో ఇద్దరు నిందితులు అయాజ్, షోయబ్ మాలిక్ పరారీలో ఉన్నారు. అరెస్టయిన నిందితుల నుంచి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఐసీ పాలసీ బాండ్లు, ఏటీఎం కార్డులు, భారత్ గ్యాస్ బుక్, వివిధ బ్యాంకుల పాస్‌బుక్‌లు, చెక్ బుక్‌లు, బర్త్ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారిని పట్టుకున్న పోలీసులు?