ACB Rides: లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి హనుమ రవీందర్ నాయక్(Ravinder Naik) మంగళవారం ఏసీబీ(ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఓ రేషన్ డీలర్ వద్ద నుంచి ఆయన ఈ లంచం తీసుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, కొంగరకలాన్‌లో డిప్యూటీ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్, అన్నారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ యాదగిరిని రేషన్ దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు, డీలర్‌పై నమోదైన పీడీఎస్ బియ్యం కేసును మాఫీ చేసేందుకు రూ.20 వేలు లంచాన్ని డిమాండ్ చేశాడు. డీలర్ యాదగిరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, నాయక్‌ను మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణంలో చౌరస్తా సమీపంలోని రాఘవేంద్ర హోటల్ వద్ద లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటన స్థలంలోనే రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రవీందర్‌ను అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఎస్‌ఐబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.
Also Read: Purushaha: మగాళ్లను మొక్కుకుంటూ కాదు.. తొక్కుకుంటూ పోతాం.. పోస్టర్ వైరల్!
ప్రతి నెలా డబ్బులు అడిగాడు
బాధితుడైన రేషన్ డీలర్ యాదగిరి మీడియాతో మాట్లాడుతూ పీడీఎస్ రైస్ కేసులో తన షాపు సీజ్ చేయడం జరిగిందని, షాపు మళ్లీ యథావిధిగా కొనసాగించడానికి అధికారి రవీందర్ రూ.20 వేలు లంచం అడిగాడని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రతి నెల షాపుకు రూ.500 చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లెక్క సరిపోని రెండు క్వింటాళ్ల బియ్యాన్ని సరి చేయడానికి రూ.20 వేలు లంచం అడిగాడని, అధికారి వేధింపులు ఎక్కువగా ఉండటంతో ఏసీబీని ఆశ్రయించినట్లు యాదగిరి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి తెలియజేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు.
Also Read: Suryapet News: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు ఓ కార్యకర్త మృతి!

