Bullet Bikes Thieves: ఇద్దరి నిందితుల పట్టివేత
13 బుల్లెట్లు, 5 పల్సర్ బైక్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మేడ్చల్ స్వేచ్ఛ: మేడ్చల్ పట్టణంలో (Medchal) గతేడాది కాలంగా బుల్లెట్ దొంగతనాలు (Bullet Bikes Thieves) జరుగుతున్నాయి. దొంగలు ప్రధానంగా బుల్లెట్లనే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఎంతో మంది అత్యంత ఖరీదైన బుల్లెట్లను పాగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే పదుల సంఖ్యలో బుల్లెట్లు చోరీకి గురయ్యాయి. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే కాకుండా, గేట్ లోపల పార్కు చేసిన వాహనాలు కూడా దొంగతనానికి గురయ్యాయి. అయితే, ఎట్టకేలకు మేడ్చల్ పోలీసులు బుల్లెట్ దొంగలను పట్టుకున్నారు. మేడ్చల్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో జరిగిన దొంగతనానికి గురైన బుల్లెట్లు, పల్సర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ మార్గదర్శకత్వంలో డీఐ కిరణ్ బృందం శ్రమించి, బుల్లెట్ దొంగలను పట్టుకున్నారు. ఏసీపీ శంకర్ రెడ్డి శనివారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడే
మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన సింగపూరి అశోక్ (10) మేడ్చల్ పట్టణంలో నివాసం ఉంటూ కారు డ్రైవర్‌గా వృత్తి నిర్వహిస్తున్నాడు. అతడికి కర్ణాటకకు చెందిన మహ్మద్ అఖిల్, ఇలియాస్ అఖిల్, అలియాస్ సల్మాన్(28)తో జైలులో పరిచయం ఏర్పడి, ఒక్కటయ్యారు. వారిద్దరు తమ అవసరాలు తీర్చుకోవడానికి, జల్సాగా బతకడానికి వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. అశోక్‌కు తాళం వేసిన బైక్లను ఎలా దొంగతనం చేయాలో సల్మాన్ నేర్పించాడు. ఇద్దరు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించారు. ఇలా దొంగలించిన వాహనాలను కర్ణాటకలోని రాయచూర్ చెందిన పింటు రాయుడు గౌడ(23), రవి(23)ల సహాయాలతో బైక్ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
Read Also- Gambling Case: అడవిలో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికారు.. ఎంత క్యాష్ దొరికిందంటే?
మేడ్చల్ పట్టివేత
డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్, కానిస్టేబుల్ నర్సింహ రెడ్డి కేఎస్ఆర్ వెంచర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అశోక్ బుల్లెట్‌పై వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని ఆపి ప్రశ్నించగా బైక్‌కు సంబంధించిన పత్రాలు చూయించలేదు. అంతేకాదు, సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో వారు తమదైన శైలిలో విచారించగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ద్విచక్ర వాహనాలను సల్మాన్‌తో కలిసి దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో సల్మాన్‌ను పట్టుకున్నారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే 13 బుల్లెట్లు, 5 పల్సర్ బైకులు, వైర్ కట్టర్, మాస్క్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎన్నో దొంగతనాల కేసు ఛేదించామన్నారు.
సీఐ సత్యనారాయణ, డీఐ కిరణ్, ఎస్సైలు, సిబ్బంది సమష్టిగా పని చేసి బైక్ దొంగతనాల్లో నిందితులను పట్టుకున్నారు. డీఐ కిరణ్ బృందం తీసుకున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు రాత్రిపూట తమ వాహనాలను భద్రపర్చుకునే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆరు బయట కాకుండా ద్విచక్ర వాహనాలను గేట్ లోపలే పార్కు చేసుకోవాలని, హ్యాండిల్ లాక్ పాటు నంబర్ లాక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, డిఐ కిరణ్, ఎస్సైలు నవిన్, మన్మధరావు, అనిత, కానిస్టేబుళ్లు నర్సింహ రెడ్డి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Read Also- Bhatti Vs Harish Rao: భట్టి గారూ… నేను సూటిగా అడుగుతున్నా.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

