Medchal District: మేడ్చల్ జిల్లా(Medchal District) శామీర్ పేట్ మండల రెవిన్యూ పరిధిలోని అలియాబాద్ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మున్సిపల్ పరిధిలోని మురారిపల్లిలో కొందరు వ్యక్తులు నివాస అనుమతులు తీసుకుని వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా చట్ట విరుద్ధంగా(G+2) అనుమతులు తీసుకొని అదనంగా (G+3) నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం పై స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేయగా వారు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మున్సిపల్‌కి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. చిరు వ్యాపారులు, చిన్న గుడిసెలు, పాన్ డబ్బాలు రోడ్డు పక్కన పెట్టుకుంటే నిర్దాక్షినంగా తొలగించే మున్సిపల్ అధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు కనబడటం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Illegal Bike Taxi: మంత్రి స్టింగ్ ఆపరేషన్.. సామాన్యుడిలా మారి.. బైక్ ట్యాక్సీల గుట్టురట్టు!
మురహరిపల్లిలో మాయాజాలం
అలియాబాద్ మురహరిపల్లి గ్రామంలో ఓ భవన నిర్మాణ విషయంలో అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి కాసులకు కక్కుర్తి పడ్డారు. మురారిపల్లి(Murari Pally) గ్రామాన్ని అలియాబాద్ మున్సిపల్‌లో కలుపుతారన్న సమాచారంతో అప్పటి పంచాయతీ కార్యదర్శి అక్రమ నిర్మాణాలకు వంత పాడారు. కాసులు తీసుకొని నిర్మాణం పూర్తి కాక ముందే వాటికి ఇంటి నెంబర్ జారీ చేశారు. ఇలా ఇక్కడ చాలానే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుడికి ఒక న్యాయం డబ్బు, పలుకుబడి ఉన్న వారికి ఇంకో న్యాయం అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనుమతి లేని కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ తతంగం పై అప్పటి పంచాయతీ కార్యదర్శి (ప్రస్తుత వార్డు అధికారి) శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా ఇలాంటి నిర్మాణాలు చాలా చోట్ల జరుగుతాయి. వాటిని నేనేమి చేయలేను అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
విచారణ చేస్తాం: కమిషనర్
భవనం పూర్తికాకముందే ఇంటి నెంబర్ జారి విషయంపై మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కమిషనర్ చంద్రశేఖర్(Commissioner Chandrashekhar) చెప్పారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అలియాబాద్ కమిషనర్ చంద్రశేఖర్ హెచ్చరించారు.
Also Read: Anganwadi: సొంత భవనాలేని అంగన్‌వాడీలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతం!