Illegal Bike Taxi: మహారాష్ట్ర ప్రభుత్వం.. బైక్ ట్యాక్సీ సర్వీసులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉబర్ (Uber), ఓలా (OLA), ర్యాపిడో (Rapido) వంటి సంస్థలు రాష్ట్రంలో బైక్స్ నడపడానికి వీల్లేదని ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను ఖరారు చేసే వరకూ బైక్ ట్యాక్సీలను నడపవద్దని సూచించింది. అయితే ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ అక్రమంగా బైక్ ట్యాక్సీ సర్వీసులు నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ (Pratap Sarnaik).. సొంత శాఖ అధికారులను ప్రశ్నించగా అలాంటిదేమి లేదని వారు సమాధానం ఇచ్చారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి.. అక్రమ బైక్ ట్యాక్సీ సేవల గుట్టు రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అసలేం జరిగిందంటే?
ముంబయి నగరం (Mubai City) లో బైక్ ట్యాక్సీ సర్వీసులు (Bike Taxi Services) అక్రమంగా జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. దీనిపై సీనియర్ అధికారిని ప్రశ్నించగా అలాంటేది జరగడం లేదని తనకు స్పష్టమైన హామీ వచ్చిందని చెప్పారు. అందులో వాస్తవమెంతో తెలుసుకునేందుకు తాను తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తన కార్యాలయమైన మంత్రాలయం నుంచి వేరొక పేరుతో దాదార్ వెళ్లేందుకు ర్యాపిడో బైక్ ను మంత్రి బుక్ చేసుకున్నారు. అనంతరం అధికారులతో సహా రోడ్డు పక్కన మంత్రి నిల్చొని ఉండగా 10 నిమిషాల్లోనే రైడర్ వచ్చి మంత్రిని కలిశారు.
मंत्रालय येथूनचं ट्रॅप ऑपरेशन – अनधिकृत रॅपिडो बाईक टॅक्सी सेवांवर थेट कारवाई…#PratapSarnaik #TransportMinister#MaharashtraTransport #ActionAgainstIllegalBikeTaxi@rapidobikeapp pic.twitter.com/K81GiHydIb
— Pratap Baburao Sarnaik (@PratapSarnaik) July 2, 2025
రైడర్‌తో సంభాషణ
మంత్రాలయం నుంచి దాదర్ వరకూ రూ.195 ఛార్జీని ర్యాపిడో సంస్థ కోట్ చేసిందని మంత్రి అన్నారు. బైకర్ వచ్చినప్పుడు మంత్రి అతడి గురించి అడిగి తెలుసుకున్నారు. ముంబైలో బైక్ సేవలకు అనుమతి లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నిర్ణయం మీలాంటి బైకర్స్ క్షేమం కోసమే ప్రభుత్వం తీసుకున్నట్లు రైడర్ తో అన్నారు. ఆ తర్వాత బైకర్ రూ. 500 ఇచ్చేందుకు మంత్రి యత్నించగా.. రైడర్ దానిని సున్నితంగా తిరస్కరించారు. ‘నీవు ఇక్కడికి వచ్చావు.. అందుకే నేను దీన్ని ఇస్తున్నాను’ అని మంత్రి చెప్పినప్పటికీ రైడర్ డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు. అయితే బైకర్ పై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని.. సామాన్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని మంత్రి అన్నారు. కాగా మంత్రి చేసిన స్టింగ్ ఆపరేషన్ పై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.