Road Widening: గత కొన్ని సంవత్సరాలుగా ఇతర ప్రాంతాల నుండి హైదరాబాదు కు వలసలు పెరగడంతో జనాభా పెరిగిపోతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. చేపట్టాల్సిన అవసరము ఏర్పడింది. బడంగ్ పేట్ సర్కిల్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో జనాభా విపరీతంగా పెరుగుతుంది.దీంతో వాహనాల తాకిడి పెరిగింది.అందుకు తగ్గట్లుగా రహదారి విస్తరణ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.కలెక్టర్ కార్యాలయం, కార్పొరేట్ సంస్థలు, వివిధ గ్రామాలను అనుసంధానం చేసే ఇక్కడి ప్రధాన రహదారి విస్తరణ విషయంలో అధికారుల తీరు స్థానికులను అసంతృప్తికి గురిచేస్తుంది.
అధికారుల్లో కొరవడిన సమన్వయం.
నాదర్ గుల్ నుండి బాలాపూర్ చౌరస్తా వరకు రోడ్డును విస్తరించాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 6 కిలోమీటర్లు ఉన్న రోడ్డులో సగభాగం పూర్తి కూడా చేశారు. బడంగ్ పేట్ గాంధీనగర్ నుంచి నాదర్ గుల్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. అప్పట్లో 9 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన రోడ్డు విస్తరణకు చెట్లు, విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా మారాయి. ఈ ప్రాంతంలో దాదాపు 75 చెట్లు ఉండగా కొన్నింటిని అటవీశాఖ అధికారులు ఇటీవల ఇతర చోటుకు తరలించారు. విద్యుత్ స్తంభాలు అలాగే ఉండిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు తొలగించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి రావాల్సి ఉంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలతో తొలగించాలంటే విద్యుత్ అధికారులు నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఒక శాఖపై ఒక శాఖ అధికారులు మీరు ముందు తొలగించండి అంటే మీరు ముందు తొలగించండి అంటూ కాలయాపన చేస్తున్నారు.అధికారులు అన్ని క్లియర్ చేస్తే రోడ్డు విస్తరణ పనులు చేపడతానంటూ కాంట్రాక్టర్ అంటున్నారు. అధికారుల్లో కొరవడిన సమన్వయంతో రోడ్డు విస్తరణకు మోక్షం కలగడం లేదు.
Also Read: Crime News: పనిమనుషుల అసాధారణ దారుణం.. సినిమాలను తలపించే రీతిలో ఐదేళ్లపాటు..
అస్తవ్యస్తంగా డివైడర్..
రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్ నిర్మాణం కోసం రోడ్డు మధ్యలో ఖాళీ స్థలం వదిలివేశారు. ఔటర్ రింగ్ రోడ్డు కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. డివైడర్ కోసం వదిలిన స్థలం ఎగుడుదిగుడుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ద్విచక్ర వాహన దారులు కిందపడి గాయాలపాలు అవుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రహదారి విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల స్థానిక భాజపా నాయకులు గాంధీనగర్ నుంచి నాదర్ గుల్ వరకు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. చూడాలి ఇప్పటికైనా ఈ రోడ్డుకు మోక్షం కలుగుతుందేమో మరి.

