Rangareddy Corruption: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాల్సిన ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతుండడంతో రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో అవినీతి రాజ్యమేలుతుంది. సమాజానికి పౌరసేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కాసులకు కక్కుర్తి పడి కార్యాలయాలను అవినీతి కేంద్రాలుగా మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది కాలంలో జిల్లాలోని అనేక శాఖల అధికారులు ఏసీబీకి ట్రాప్ అయ్యి దొరికినప్పటికీ, మిగిలిన అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. ఈ కారణంగా, అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే విద్యాశాఖ, ఇంటర్మీడియట్ కార్యాలయం, మైనింగ్, సివిల్ సప్లై, జిల్లా పంచాయతీ శాఖల ఉద్యోగులపై ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తుంది.
అక్రమాలకే ప్రాధాన్యత
రంగారెడ్డి జిల్లాలోని పలువురు అధికారుల అక్రమాలు జిల్లాను అవినీతికి అడ్డాగా మార్చేశాయి. క్షేత్రస్థాయి అధికారులే కాకుండా ఉన్నత ఉద్యోగులు సైతం అవినీతిలో భాగస్వామ్యం అవుతూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్నారు. రెవెన్యూ సమస్యలను ఆసరాగా చేసుకోవడం, విద్యాశాఖ అనుమతుల్లో అక్రమాలు, ఈటీఆర్ల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపించే స్కూల్స్‌కు మద్దతు ఇవ్వడం, నగదుకు ఆశపడి అనుమతులు లేని మైనింగ్ మాఫియా నడవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. చిన్న సమస్యల పరిష్కారానికి కూడా డబ్బులు ఇవ్వకుంటే సకాలంలో జరిగే పని ఏళ్లు పడుతోందనే దౌర్భాగ్య పరిస్థితి రంగారెడ్డి జిల్లాలో నెలకొంది.
Also Read: PDS Rice Scam: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం.. లారీ సీజ్..!
దాడులకు రంగం సిద్ధం
గతంలో జిల్లా రెవెన్యూ(Revenue) అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడగా, తాజాగా గురువారం ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాస్(AD Srinivas) బిలదాఖలాల భూమికి సర్వే నంబర్లు సృష్టించి అవినీతికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ విధంగా జిల్లా కేంద్రంలోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల హెచ్‌ఓడీలు సైతం పనుల కోసం వచ్చే బాధితులను కాసుల కోసం పీడిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఫిర్యాదుల ఆధారంగా రెక్కి నిర్వహిస్తున్నారు. త్వరలోనే దాడులు చేయడం జరుగుతుందని, ముఖ్యంగా కలెక్టరేట్‌లోని ఓ క్రియాశీలక విభాగం అధికారిపై దాడులు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
Also Read: IND vs SA 3rd ODI: వైజాగ్‌లో నిర్ణయాత్మక మ్యాచ్.. మూడో వన్డే గెలిచేదెవరు? సిరీస్‌ను సాధించేదెవరు?

