Chandana Lake: పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్యం మూగజీవాల పాలిట శాపంగా మారింది. కర్యాగారాలు వదిలిన వ్యర్థ జలాలు చెరువులను కాలుష్య కారకాలుగా మారుస్తున్నాయి. దీంతో చేపలతోపాటు ఆ నీటిని తాగి మూగజీవాలు సైతం మృత్యువాత పడుతుంటే వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కట్టడిలో పూర్తిగా విఫలమవుతున్నారని స్థానిక ప్రజానీకం ఆవేదన చెందుతోంది. రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) షాబాద్ మండలంలోని చందన చెరువు సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది.
చెరువు చుట్టూ విరివిగా పరిశ్రమలు
సాగు, తాగు నీటి అవసరాలకు ఉపయోగపడుతూ కళకళలాడిన చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని చందన చెరువు నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. చుట్టూ పరిశ్రమలు విస్తరించడంతో అవి వదులుతున్న వ్యర్థాలు నేరుగా వచ్చి చెరువులోకి చేరుతున్నాయి. దీంతో నీరంతా రంగు మారి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ మురుగు నీటితో భూగర్భ జలాలు(Groundwater) సైతం కలుషితం అవుతున్నాయి. చెట్టు చుట్టూత ఉన్న పరిసరాల్లో భూగర్భ జలాలు పెంపొందింప జేయడంలో చందన చెరువు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. చెరువు చుట్టూ ఉన్న రైతులు వివిధ పంటలు వేసుకుని జీవనం కొనసాగించారు. కానీ గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం షాబాద్ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసింది.
దీంతో ఈ చెరువు చుట్టుపక్కల యాభైకి పైగా పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేశామని గత ప్రభుత్వం చెప్పగా ఆయా పరిశ్రమలు వదులుతున్న వ్యర్థాలు మాత్రం నేడు ఈ ప్రాంత ప్రజానీకానికి శాపంగా మారాయి. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమ పరిశ్రమల్లో ఈటీపీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోకుండా కాలువల ద్వారా చందన చెరువులోకి ప్రమాదకర వ్యర్థాలను వదులుతున్నారు. దీంతో చెరువు నీరు పచ్చగామారి కలుషితమై పోయింది. దీంతో చెరువు ఏ అవసరాలకు పనికిరాకుండా పోయింది.
Also Read: Congress on KTR: మెదక్ ప్రజలను గాడిదలు అన్న కేటిఆర్.. ఎస్పీకి ఫిర్యాదు
చేపలు, మూగ జీవాలు మృత్యువాత
చందన చెరువు(Sandalwood pond) కలుషితం కావడంతో అందులో మత్స్య సంపదకు సంకటంగా మారింది. అందులో వేసిన చేప పిల్లలు(Fish) సరైన ఎదుగుదల లేకపోవడంతోపాటు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల ఉపాధి లేకుండా పోయిందని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా చెరువుకు పక్కనే ఉన్న వెల్స్పన్ పరిశ్రమ ఇష్టానుసారంగా వ్యర్థాలను బయటకు వదిలి పెడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వర్షం పడ్డప్పుడల్లా పరిశ్రమ నుంచి వ్యర్థాలను చెరువులోకి వదిలి వేయడం వల్ల చేపలు చనిపోతున్నాయని మత్స్య కారులు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని తాగిన మూగ జీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వ్యర్థ జలాల కారణంగా తీవ్రమైన దుర్వాసన వచ్చి వాయు కాలుష్యం ఏర్పడడంతో స్థానిక ప్రజల ఆరోగ్యానికి సైతం పెను ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. చందన చెరువులోని వ్యర్థాలు అనేక గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈసీ వాగులోకి ప్రవహించి చివరకు హియామత్ సాగర్‌లో కలుస్తాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Vadhannapet: వర్ధన్నపేట మండలంలో మట్టిబొమ్మకు పూజలు.. జనం పరుగులు