Abdullapurmet Land (imagecredit:swetcha)
రంగారెడ్డి

Abdullapurmet Land: సహజ ప్రకృతి సంపదకు రియల్‌ ముప్పు.. అస్థిత్వాన్ని కోల్పోనున్న చెరువులు..

రంగారెడ్డి బ్యూరో స్వేచ్చ: Abdullapurmet Land: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలంలోని అనాజ్‌ పూర్‌ గ్రామంలో అరాచకాండ రాజ్యమేలుతోంది. అభివృద్ది పేరిట సహజ ప్రకృతిలో భాగమైన కొండలు, గుట్టలను కొల్లగొడుతున్నారు. 300 ఎకరాల భూములను చదును చేసేందుకు ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ చేపడుతున్న పనులు నీటి వనరుల ఉనికినే ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. తొలచిన గుట్టలకు సంబంధించిన పెద్ద పెద్ద బండరాళ్లను ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో వేస్తుండడంతో వేముల కత్వా తన అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉంది. వందల ఎకరాలకు జీవం పోస్తూ మూసీ వరకు పారే అనేక గొలుసు కట్టు చెరువులకు ఈ కత్వానే ఆయువుపట్టుగా ఉండడంతో వాటి ఉనికికీ భవిష్యత్తుల్లో ముప్పువాటిల్లనున్నది. కళ్లెదుట అక్రమం జరుగుతున్నప్పటికీ చర్యలకు అధికారయంత్రాంగం మౌనముద్ర వహించడం విమర్శలకు తావిస్తోంది. ఈ భూదందా వెనుక బడా నేతలు ఉండడం వల్లనే అధికారులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నట్లు బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది.

వెంచర్‌ కోసమేనా:

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌-ఇబ్రహీంపట్నం మండలాల సరిహద్దులో సుమారు 300 ఎకరాల్లో భూములను చదును చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 189లో, అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 281 పరిధిలోని ఈ భూముల్లో ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఈ పనులను చేపడుతోంది. చదును చేస్తున్న భూముల్లో కొంతమేర పట్టాభూములతోపాటు అసైన్డ్ భూములు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ భూముల్లో ఉన్న పెద్ద పెద్ద గుట్టలను బ్లాస్టింగ్‌ చేసి పిండి చేస్తున్నారు. ట్రక్కులతో మట్టి పోసి చదును చేస్తున్నారు. ఇదంతా.. వెంచర్‌ ఏర్పాటు చేసి విల్లాల కోసమేనని బహిరంగ ప్రచారం జరుగుతోంది. రియల్‌ మాటున ఈ ప్రాంతంలో జరుగుతున్న భూ దందా వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. సరైన అనుమతులు లేకుండానే పనులు చేపట్టడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు విన్పిస్తున్నప్పటికీ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ తతంగం వెనుక ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఉన్నట్లు ఈ ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది.

నీటి వనరులకు పెనుముప్పు:

అనాజ్‌పూర్‌ గ్రామంలోని గుట్టల్లో జరుగుతున్న తవ్వకాలతో ఇక్కడి నీటి వనరులకు ముప్పు వాటిల్లుతోంది. తొలచిన పెద్ద పెద్ద బండరాళ్లను ఇప్పటికే చాలావరకు వేముల కత్వాలో పడవేశారు. ఇలాగే..బండరాళ్లను వేసుకుంటూ పోతే మున్ముందు కత్వా ఉనికే ప్రశ్నార్థకం కానుంది. ఈ కత్వాకు పక్కనే 500 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఇందిరా సాగర్‌ చెరువు ఉంటుంది. మహేశ్వరం మండలం రావిర్యాలలోని పెద్ద చెరువు నుంచి వరద నీరు గొలుసు కట్టు ద్వారా వేముల కత్వాలోకి వచ్చి అక్కడి నుంచి ఇందిరా సాగర్‌లోకి వెళ్తాయి.

ఇక్కడి నుంచి వరద నీరంతా దిగువన ఉన్న అనాజ్‌పూర్‌ చెరువుకు చేరి అక్కడి నుంచి మూసీలో కలుస్తాయి. సుమారు వంద ఫీట్ల వెడల్పుతో గొలుసుకట్టులో ఎంతో కీలకంగా ఉన్న వేముల కత్వాలోకి పెద్ద పెద్ద బండరాళ్లను వేస్తుండడంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలోని ప్రజా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

Also Read: Train Journey with Children: మీ పిల్లలతో ట్రైన్ జర్నీ.. ఇలా ప్లాన్ చేసుకోండి.. లేకుంటే?

కత్వా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే మట్టి రోడ్డును వేసి పెద్ద పెద్ద బండరాళ్లను కత్వాలోకి జార విడుస్తున్నారు. కత్వా, ఇందిరా సాగర్‌ చెరువుల మధ్య ఉన్న బఫర్‌ జోన్‌ పరిధిలోనే ఈ తంతు నడుస్తోంది. ఈ ప్రాంతం అంతా సర్వే నంబరు 281ని అనుసరించి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిఉన్న నీటి వనరులు ఉన్న చోట భారీ ఎత్తున పనులు చేపడుతున్న నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖ నుంచి ఎటువంటి అనుమతులకు దరఖాస్తు చేయకపోవడం విడ్డూరం. కన్‌స్ట్రక్షన్‌ సంస్థ చేపడుతున్న పనుల ప్రాంతానికి సమీపంలోనే రామోజీ ఫిలిం సిటీ ఉంది.

ఇదే ప్రాంతంలో ఉన్న ఇందిరా సాగర్‌ చెరువును గత ప్రభుత్వం సుమారు రూ.60లక్షలు వెచ్చించి ఆధునీకరించింది. ఎత్తైన కొండలు, గుట్టలతో పచ్చని ఆహ్లాదంతో విరాజిల్లుతున్న ఈ ప్రాంతంలో జరుగుతున్న పర్యాటక విధ్వంసంతో పర్యాటక ప్రేమికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనుమతులు తీసుకోలేదు: వంశీ గౌడ్‌, ఏఈ

అనాజ్‌ పూర్‌ గ్రామ పరిధిలో వేముల కత్వా సమీపంలో చేపడుతున్న పనులకు సంబంధించి కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఎటువంటి అనుమతులకు దరఖాస్తు చేయలేదు. బండరాళ్లను కత్వాలో వేస్తున్నట్లు తెలియడంతో వాటిని తొలగించేందుకు మూడు రోజులు సమయం ఇచ్చాం. మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి కన్‌స్ట్రక్షన్‌ సంస్థ నిబంధనలకు విరుద్దంగా పనులు చేపట్టినట్లు తేలితే తగు చర్యలు తీసుకుంటాం.

చెరువులను పరిరక్షించడంలో అధికారులు విఫలం: 

చెరువులను పరిరక్షించడంలో రెవిన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. విల్లాలు నిర్మించేందుకు 300 ఎకరాలు చదును చేస్తుండగా నిర్వాహకులు హెచ్‌ఎండిఎ, మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. పెద్ద పెద్ద గుట్టలను పగులగొట్టి బండ రాళ్లను వేముల కత్వా, ఇందిరా సాగర్‌ చెరువుల పరిధిలోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో వేస్తున్నారు. ఇప్పటికే ఓ పక్క రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కత్వాకు ఆనుకుని భారీ గోడను నిర్మించింది. ఇటువైపు రియల్‌ ఎస్టేట్‌ నిర్వాహకులు రాళ్లు వేయడం వల్ల ఈ ప్రాంతంలో సాగు, తాగునీటికి ఆదరువుగా ఉన్న చెరువులు ఉనికినే కోల్పోతున్నాయి.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?