Telangana: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్‌లో వేడుకల నిర్వహణ
చీఫ్ గెస్ట్‌గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఇప్పటికే హైదరాబాద్‌కు చేరిక
జేబీఎస్ వద్ద వాజ్‌పేయ్ విగ్రహావిష్కరణ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ విమోచన వేడుకలను (Telangana) కేంద్ర ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 17న) అధికారికంగా నిర్వహిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. మంగళవారం రాత్రి ఆయన ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేస్తున్నారు. బుధవారం ఉదయం 8:55 గంటల నుంచి 11:30 వరకు తెలంగాణ విమోచన దినోత్సవ సంబురాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11:35 గంటలకు జూబ్లీ బస్టాండ్ పరిధిలో అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
పరేడ్ గ్రౌండ్‌లో బుధవారం నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొంటారు. కాగా ఈ కార్యక్రమంలో పారామిలటరీ పరేడ్ నిర్వహించనున్నారు. కళాకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు. ఇదిలావుండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 7 గంటలకు రాంచందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
Read Also- Pending Bills: పెండింగ్ బిల్లులను వారంలో క్లీయర్ చేయాలి.. మంత్రి సీతక్కకు టీపీఎస్ఎఫ్ విజ్ఞప్తి
రాజ్ నాథ్ సింగ్‌కు ఆహ్వానం పలికిన అనంతరం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవమంటే.. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ లాంటి వారిని స్మరించుకునే రోజు అని వివరించారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమం విమోచన దినోత్సవమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ భారతదేశంలో విలీనమవ్వడం గొప్ప చరిత్ర అని, అలాంటి చరిత్రను పలువురు ప్రబుద్ధులు కాలరాస్తున్నారని విమర్శలు చేశారు. ఈ విమోచన దినోత్సవం కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉత్సవంగా జరుపుకుంటున్నాయని, కానీ తెలంగాణలో మజ్లిస్ ప్రాబల్యం ఉన్నచోట తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని విస్మరించారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.