Rahul Gandhi: బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి విమర్శలు చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆదివారం ఓట్ చోరీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారును గద్దె దించుతామని అన్నారు. బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. బిహార్ ఎన్నికల్లో ఓటుకు రూ.10 వేలు పంచినా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం తెచ్చిన చట్టాన్ని మార్చి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాస్త సమయం పట్టినా చివరకు సత్యమే గెలుస్తుందని తెలిపారు. మోదీ, అమిత్ షాను ఓడించేందుకు అహింస మార్గంలో పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.
ద్రోహులను గద్దె దించాలి
ఓట్ చోరీకి పాల్పడేవారు ద్రోహులని వారిని గద్దె దించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పిలుపునిచ్చారు. సమిష్టిగా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదని తెలిపారు. బీజేపీ నేతలు కేవలం డ్రామాలు చేస్తుంటారని అన్నారు. కొందరైతే పార్లమెంట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తారని అంటుంటారని, మోదీ ఎందుకు పాల్గొనరని ఈ సందర్భంగా ప్రశ్నించారు. దేశాన్ని తుద ముట్టించడమే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని విమర్శలు చేశారు.
Also Read: H-City Projects: ప్రాజెక్టుల పై బల్దియా ఫోకస్.. రూ 1090 కోట్లతో కేబీఆర్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్లు
ఓట్ చోరీ వల్లే బీజేపీ గెలుస్తున్నది
బిహార్ ఎన్నికల సమయంలో బీజేపీ నిబంధనలు అతిక్రమించిందని ప్రియాంక గాంధీ అన్నారు. అయినా కూడా ఈసీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. దేశంలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ గెలుస్తున్నదని దేశం మొత్తం తెలుసని చెప్పారు. దమ్ముంటే బ్యాలెట్ విధానంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటూ బీజేపీకి సవాల్ చేశారు.
Also Read: Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

