H-City Projects: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన హెచ్‌సిటీ (హైదరాబాద్ కనెక్టివిటీ అండ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్) ప్రాజెక్టులపై జీహెచ్‌ఎంసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో, ఇకపై హెచ్‌సిటీ పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన తరచూ సమీక్షలు నిర్వహించడంతో, గ్రేటర్ హైదరాబాద్ ఇంజినీరింగ్ అధికారులు ప్రస్తుతం పనులన్నీ గ్రౌండ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రూ. 738 కోట్లతో 20 ప్రాజెక్టులు..
సుమారు రూ. 738 కోట్లతో ఐదు ప్యాకేజీల కింద 23 ప్రాజెక్టుల పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కేబీఆర్ చుట్టూ, కూకట్‌పల్లి వై జంక్షన్, గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ వద్ద భూసార పరీక్షలు, సర్వేలు నిర్వహించగా, అవి కొలిక్కి వచ్చాయి. మూడు ప్రాజెక్టులు మినహా, మిగిలిన 20 ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు జిహెచ్‌ఎంసీ ప్రయత్నిస్తుంది. టెండర్లు పూర్తయిన ఈ పనులకు సంబంధించి, కేబీఆర్ చుట్టూ చేపట్టనున్న ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్‌ల నిర్మాణాన్ని మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. మరికొన్ని ప్రాజెక్టులను ఎంఎన్‌ఆర్ సంస్థ కైవసం చేసుకోగా, పనులు అప్పగించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: Messi In Hyderabad: మెస్సీతో ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్.. గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి
కేబీఆర్ చుట్టూ మెగా నిర్మాణాలు..
తరచూ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న పనులనే తొలుత ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తుంది. స్థల సేకరణ, యుటిలిటీ బదలాయింపు వ్యయంతో కలిపి సుమారు రూ. 1090 కోట్లతో ఇక్కడ ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను మొత్తం 100 పిల్లర్లతో నిర్మించనున్నారు. ఇక్కడ 269 ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించాల్సి ఉండగా, కోర్టులో మూడు వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ, వివాదాలు లేని చోట వెంటనే పనులు ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తుంది. ఈ పనులు ప్రారంభం కాగానే, వీటికి సమాంతరంగా కూకట్‌పల్లి వై జంక్షన్ లోని ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తుంది.
Also Read: Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

