Cattle Market (imagecredit:swetcha)
నల్గొండ

Cattle Market: పశువుల సంతలో ఇష్టారాజ్యం.. వేలం వేయకుండానే రికార్డులు.. ప్రభుత్వ ఆదాయానికి గండీ!

దేవరకొండ స్వేచ్ఛ: Cattle Market: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కొండమల్లేపల్లి సంతకు మంచి గుర్తింపు ఉంది. గ్రామపంచాయతీలకు అధిక ఆదాయం సమకూర్చే సంతల్లో కొండమల్లేపల్లి పశువుల సంతకు పేరుంది. అయితే ఈ సంత మాటున అక్రమార్కులు కొత్త దందాకు తెర లేపారు. ఏకంగా ఓపెన్ టెండర్లు పిలవకుండానే పిలిచినట్టు రికార్డులు సృష్టించి.. పాత కాంట్రాక్టర్‌కే బినామీ పేరుతో కొత్తగా సంత కాంట్రాక్టును కట్టబెట్టారు. నిజానికి సదరు కాంట్రాక్టర్ పదేండ్లుగా సంతలో కింగ్ మేకర్ అయ్యారు. అధికారులతో పాలకవర్గాలకు అమ్యామ్యాలు ముట్టజెప్పుతుండడంతో ఆ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మారింది.

అయితే సదరు కాంట్రాక్టర్‌కు కల్పతరువులా మారిన కొండమల్లేపల్లి సంతను చేజిక్కించుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ అధికారుల నుంచి సహకారం అందకపోవడానికి తోడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి పాత కాంట్రాక్టర్‌కు కొత్త పేరుతో అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. అసలు బహిరంగ టెండర్ వేయకుండానే వేసినట్టు రికార్డులు సృష్టించడం మరో హైలెట్ అని చెప్పాలి. రాత్రి సమయంలో కార్యాలయ సిబ్బందిని బయటకు పంపించేసి సదరు కాంట్రాక్టర్ 4 డీడీలు తీసి బహిరంగ వేలంపాట వేసినట్టు రికార్డులు సృష్టించారు. మొదట్లో కొండమల్లేపల్లి సంత బహిరంగం వేలం నిర్వహించాలంటూ కొంతమంది హైకోర్టను ఆశ్రయించారు.

దీంతో కోర్టు కొండమల్లేపల్లి సంతను బహిరంగ వేలం పాటు వేయాలంటూ ఆదేశించింది. అయితే అధికారులు ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కి గుట్టుచప్పుడు కాకుండా బహిరంగ వేలం పాట నిర్వహించామంటూ రికార్డులు సృష్టించి తెలివిని ప్రదర్శించారు. గత పదేండ్లుగా సదరు కాంట్రాక్టర్‌కే సంత వేలంపాట దక్కించుకుంటున్నా.. మళ్లీ అతడికి వచ్చేలా అధికారులు బహిరంగ వేలం తంతను నిర్వహించడం కొసమెరుపు. తాజాగా ఆ కాంట్రాక్టర్ కొండమల్లేపల్లి సంతను రూ.1.23 కోట్లకు సంత వేలంపాట దక్కించుకున్నట్టు అధికారులు సర్టిఫై చేశారు.

Also Read: Gutta Sukhender Reddy: యంత్రాలు ఇవ్వడానికి సర్కార్ సిద్ధం.. గుత్తా సుఖేందర్ రెడ్డి

మార్చి 31 వరకు వేలంపాట బహిరంగంగా నిర్వహించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 2న కోర్టు కేసులో సంత వేలంపాట నిర్వహించలేదని నివేదిక అధికారులు సమర్పించినట్టు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 17న తిరిగి మళ్లీ కేసు బెంచ్ మీదకు రానున్నట్టు తెలుస్తోంది. కానీ అధికారులు మార్చి 29న బహిరంగ వేలం నిర్వహించినట్టు తాజాగా రికార్డులు సృష్టించినట్టు సమాచారం.

పదేండ్లుగా నిలువు దోపిడీ.. 

కొండమల్లేపల్లి సంతలో పదేండ్లుగా ఇదే తంతు నడుస్తోంది. నిజానికి బహిరంగ వేలం పాట వేస్తే కొండమల్లేపల్లి గ్రామపంచాయతీకి రూ.2కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు అమ్యామ్యాలు పుచ్చుకుని కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఏటా గ్రామపంచాయతీ రూ.75 లక్షలకు పైగా ఆదాయం కోల్పోతోంది. మరోవైపు కాంట్రాక్టర్ ఏటా వేలం పాట పాడుతూ సంతను దక్కించుకుంటున్నాడు.

కానీ గ్రామపంచాయతీకి కేవలం 50 శాతం మాత్రమే డబ్బులు చెల్లించి మిగిలిన 50 శాతం డబ్బులను స్వాహా చేస్తుండడం కొసమెరుపు. పాలకవర్గం, అధికారుల అండకు రాజకీయ ఒత్తిళ్లు తోడవ్వడంతో బహిరంగ వేలం పాట పాడిన దాంట్లోనూ సగం సొమ్ము గ్రామపంచాయతీ ఖజానాకు చేరడం లేదు. కాంట్రాక్టర్‌ నుంచి పెద్దమొత్తంలో ముడుపులు అందుతుండడంతో మౌనమే రాజ్యమేలుతోంది. వాస్తవానికి ఒకసారి సంతను దక్కించుకున్న కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లిస్తేనే.. మళ్లీ ఓపెన్ టెండర్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

కానీ అధికారులు మాత్రం ఆ నిబంధనలను పట్టించుకోవడం లేదు. మరోవైపు ఇంత భారీ ఆదాయం ఉన్న సంతలో కనీస వసతులు ఉండకపోవడం గమనార్హ. ఇదిలావుంటే.. కొండమల్లెపల్లి పశువుల సంత టెండర్‌పై వస్తున్న పలు ఆరోపణలపై వివరాలను వెల్లడించేందుకు అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. కొండమల్లేపల్లి స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో బాలరాజులరెడ్డి, దేవరకొండ డిఎల్పిఓ శంకర్ నాయక్‌లు ఫోన్ ఎత్తకపోవడం గమనార్హం.

Also Read: Revanth Reddy: బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం.. ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది