తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Gutta Sukhender Reddy: రాజకీయాల్లో ఉన్నా వ్యవసాయం చేస్తున్నానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రైతు మహోత్సవం-2025 ను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ వ్యవసాయం అంటే కష్టాలతో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే అన్నారు. అందరూ వ్యవసాయ రంగం నుంచి వచ్చినవారే అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి యాత్రపరికరాలు అవసరం అన్నారు.
నేను చదువుకునే రోజుల నుంచి వ్యవసాయం చేశానన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ నాకు అనుభవం ఉందని తెలిపారు. ఆయిల్ ఫామ్, మామిడి, వరి సాగుచేస్తున్నట్లు వెల్లడించారు. బర్లు, గొర్లు, ఆవులు, కోళ్లు కూడా నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయన్నారు. వారానికి రెండు రోజులైనా వ్యవసాయం చేస్తా నని స్పష్టం చేశారు. అక్కడికి వెళ్తేనే మనసు నిమ్మలంగా ఉంటదన్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని, పండిన పంట ఇంటికి వచ్చే వరకు రైతుకు టెన్షనే అన్నారు.
బీహార్, ఛత్తీస్ ఘడ్, యూపీ నుంచి కూలీలు వస్తున్నారన్నారు. విదేశాలనుంచి పెద్దఎత్తున ఆయిల్ దిగుమతి చేస్తుంటున్నామన్నారు. ఐతే దాన్ని తగ్గించడానికి ఆయిల్ ఫామ్ సాగును రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. యూట్యూబ్ లో చూసి రైతులు సాగులో మెళుకువలు నేర్చుకుంటున్నారని, నేను కూడా సాయంత్రం వేళల్లో చూస్తానన్నారు. సబ్సిడీ పై యంత్ర పరికరాలు ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కార్ ముందుకు పోతుందన్నారు.
Also Read: SP Akhil Mahajan: కాలీగా తిరిగితే జైలుకే యువతకు వార్నింగ్.. ఎస్పీ అఖిల్ మహాజన్
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డా సీఎం కాకముందు కూడా ఎక్కువగా రైతులకోసం ఆలోచన చేసేవారన్నారు. రైతు బిడ్డా కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి రైతులకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. నా రాజకీయ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. 21 వేల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం ఆషామాషీ కాదన్నారు.
నేను కూడా ఊహించలేదు సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులకు కూడా బోనస్ బాగా ఉపయోగపడిందన్నారు. వ్యవసాయారంగాన్ని ఉత్తమం చేసే దిశగా సర్కార్ పనిచేస్తుందన్నారు. నాబార్డు కూడా రైతులు అండగా నిలబడుతోందన్నారు. రైతుల కోసమే రైతు కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. విత్తనాన్ని తయారుచేసుకునే బాధ్యత రైతుదే అని స్పష్టం చేశారు. విత్తన కంపెనీలే రైతులను శాసిస్తున్నారన్నారు. మార్కెట్ లో దళారుల దందా కూడా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు చాలా మోసపోయారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆర్వో ఆర్ చట్టం తెచ్చారన్నారు. విత్తన చట్టం కూడా తేబోతున్నారన్నారు. రైతుల విషయంలో రాజకీయాలు వద్దు అని కోరారు.