Nagarkurnool: వారిద్దరు భార్య భర్తలు. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఎంతో హాయిగా సాగుతున్న వారి కాపురంలోకి అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. అంతే ఆ భర్త క్రూర మృగాడిగా మారిపోయాడు. భార్యను ఎలాగైన గుట్టుచప్పుడు కాకుండా లేపేయాలని భావించాడు. ప్లాన్ లో భాగంగా విహారయాత్రకు వెళ్దామని భార్యకు చెప్పగా ఆమె నమ్మింది. అలా అడవిలోకి తీసుకెళ్లి ఆమె గొంతు నులిమి.. కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
మహబూబ్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం, శ్రావణి భార్య భర్తలు. రాంగ్ నెంబర్ ద్వారా ఏర్పడ్డ వీరి పరిచయం.. పెళ్లి పీటలు ఎక్కేలా చేసింది. ప్రస్తుతం ఈ జంటకు బాబు, పాప ఉన్నారు. అయితే ప్రేమించినప్పుడు బాగానే ఉన్న శ్రీశైలం.. పెళ్లి తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. శ్రావణిపై అనుమానం పెంచుకొని ఆమెను తరుచూ వేధించసాగాడు. దీంతో పెళ్లైన కొంతకాలానికే శ్రావణి.. భర్త, పిల్లలను వదిలేసి అక్క వద్దకు వెళ్లిపోయింది.
తరుచూ ఫోన్స్, చాటింగ్
ఏడాది కాలం తర్వాత భర్త నచ్చజెప్పి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ శ్రావణి తన ఇద్దరు పిల్లలతో మహబూబ్ నగర్ లో జీవించడం ప్రారంభించింది. మరోవైపు శ్రీశైలం హైదరాబాద్ లోని ఓ హాస్టల్లో పనికి కుదిరాడు. అయితే భార్య శ్రావణి.. తరుచూ ఫోన్లు మాట్లాడటం, చాటింగ్ చేస్తుండటంతో శ్రీశైలానికి మళ్లీ అనుమానం ప్రారంభమైంది. అలా చేయవద్దని భార్యకు సూచించిన ఆమె వినిపించుకోలేదు. దీంతో భార్యను ఎలాగైన హత్య చేయాలని శ్రీశైలం నిర్ణయించుకున్నాడు.
Also Read: Khammam District: నోట్లో గుడ్డలు కుక్కి.. భర్తను చితక్కొట్టిన భార్య.. దెయ్యమే కారణమా?
సీతాఫలం కోసమని చెప్పి..
ఆగస్టు 21న హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వచ్చిన శ్రీశైలం.. భార్యకు సోమశిల వెళ్దామని చెప్పాడు. దీంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరు బయలుదేరారు. నల్లమల ఫారెస్ట్ లో ప్రయాణిస్తున్న క్రమంలో సీతాఫలం కోసమని చెప్పి బండి ఆపాడు. అడవిలోకి తీసుకెళ్లి భార్య గొంతు నులిమి, వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. ఎవరూ గుర్తు పట్టకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి తగలపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read: Cyberabad Women Security: 143 డెకాయ్ ఆపరేషన్లు.. పట్టుబడ్డ 70 మంది పోకిరీలు!
పోలీసులకు లొంగుబాటు
కూతురు కనిపించకపోవడంతో శ్రావణి తండ్రి మహబూబ్ నగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత మిస్సింగ్ కేసుగా పరిగణించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే అందరికీ షాకిస్తూ శ్రీశైలం.. లింగాల పోలీసు స్టేషన్ లో లొంగిపోవడంతో.. అసలు విషయం వెలుగుచూసింది. అక్కడి పోలీసులు మహబూబ్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు.
