Mahabubnagar district: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వినూత్నంగా ‘మాస్టర్’ (మహబూబ్‌నగర్ స్కిల్స్ ట్రెయినింగ్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ రెడీనెస్) పేరుతో ప్రత్యేక ట్రెయినింగ్ సెషన్‌కు రూపకల్పన చేసింది. యూనివర్శిటీ వైస్ చాన్సెలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం జిల్లాలోని నాలుగు డిగ్రీ కళాశాలల్లో ఈ ప్రోగ్రామ్‌ను అమలు చేసేలా యాక్షన్ ప్లాన్‌ను సిద్దం చేసింది.
మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎమ్వీఎస్ డిగ్రీ కాలేజీ, ఎన్టీఆర్ కాలేజీలను ఎంపిక చేయగా జడ్చర్లలోని బీఆర్ఆర్ కాలేజీని, కొడంగల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఎంపిక చేసింది. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజీతోపాటు సాఫ్ట్ స్కిల్స్ అందించడం ద్వారా కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలు లభించేలా ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది.
నాలుగు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్ళతో సమావేశమై లోతుగా చర్చించిన తర్వాత ‘మాస్టర్’ శిక్షణను విద్యార్థులకు అందించాలని స్కిల్స్ యూనివర్శిటీ వీసీ నిర్ణయం తీసుకున్నారు. ఈ శిక్షణలో భాగంగా నాలుగు డిగ్రీ కాలేజీల్లో 2,094 మంది విద్యార్థులకు ఈ స్కిల్స్ అందించనున్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్నందున పూర్తిగా ఒక సంవత్సరం పాటు శిక్షణ అందిస్తే ఆ తర్వాత ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది వీసీ భావన.
Also read: MP Chamala Kiran: కేటీఆర్ చెప్పిన డెడ్ లైన్ దాటిపోయింది.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఈ ట్రెయినింగ్ సెషన్‌ను బేసిక్, బేసిక్ ప్లస్ అనే రెండు కేటగిరీల్లో అందించేలా రూపకల్పన జరిగింది. కాలేజీల్లో రెగ్యులర్ తరగతులతో పాటు ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినింగ్ కోసం ప్రత్యేకంగా టైమ్ టేబుల్ కూడా తయారవుతున్నది. డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత ఆంగ్ల భాషపై పట్టు రావడంతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారి వ్యక్తిత్వం వికసిస్తుందని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ సాధ్యమవుతుందని, ఫ్యూచర్ కెరీర్‌పై అవగాహన పెరుగుతుందని వీసీ అభిప్రాయపడ్డారు.
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి చొరవతో కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులతో ఈ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ అమలవుతుందని, త్వరలోనే లాంఛనంగా దీనికి ప్రారంభోత్సవం జరుగుతుందని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ వర్గాలు పేర్కొన్నాయి.