Ward Member Dies:
నాగర్ కర్నూల్, స్వేచ్ఛ: ఎన్నికల్లో గెలిచాడు… వార్డు సభ్యుడిగా గ్రామ ప్రజలకు సేవలు అందించాలనుకున్నాడు… కానీ గెలుపు ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఓ వార్డు సభ్యుడు గెలిచిన రోజు తెల్లారేసరికి మృత్యు ఒడికి చేరాడు . ఈ విషాద గాథ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని 7వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ మద్దతుదారు మహేష్ పోటీ చేశారు. ఆదివారం జరిగిన రెండవ దశ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. చాలా ఆనందపడ్డారు. గెలుపునకు సహకరించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్న మహేష్ రాత్రి నిద్రపోయారు. అయితే, గుండెపోటు రావడంతో ఆయన నిద్రలోనే మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకొంది. తమతో కలిసి గెలుపు సంతోషాన్ని పంచుకున్న మహేష్ ఇప్పుడు తమ మధ్యలేకపోవడం చాలా బాధకరమని వాపోతున్నారు. ప్రజలకు సేవ చేద్దామన్న కలలు తీరకముందే మరణించడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడవ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్
గద్వాల, స్వేచ్ఛ: గ్రామపంచాయతీ మూడవ విడత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, ఎన్నికల సాధారణ పరిశీలకులు గంగాధర్ తో కలిసి మూడవ విడత పోలింగ్ సిబ్బందికి సంబంధించి మూడవ ర్యాండమైజేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని, ఈనెల 17న ఎన్నికలు జరిగే జిల్లాలోని ఆలంపూర్, ఇటిక్యాల, మానవపాడు, ఉండవెల్లి, ఎర్రవల్లి మండలాల్లో మొత్తం 700 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఏకగ్రీవాల అనంతరం మిగిలిన 638 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగిందన్నారు. మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో 1,00,372 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల నిర్వహణ విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీకాంత్, ఈడియం శివ, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Also- Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం
జిల్లాను మొదటి స్థానంలో నిలపండి: మెదక్ కలెక్టర్
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. తొలి రెండు విడతల్లో కలిపి ఓటింగ్ శాతంలో రాష్ట్రంలో 5 స్థానంలో మెదక్ జిల్లా నిలిచిందని, మూడో విడత ఎన్నికలలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి, రెండవ విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లే.. మూడవ విడత ఎన్నికల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పూర్తి చేయాలన్నారు. కాగా, జిల్లాలో ఈ నెల 17న మూడవ విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం శివంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట్ ఉన్నాయి.

