ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు గడువు
గెలిచినా, ఓడిన వారే కాక ఏకగ్రీవ స్థానాల్లో కూడా తప్పనిసరి
గద్వాల, స్వేచ్ఛ: గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ కూడా పూర్తయింది. గెలిచిన వారే కాక, ఓడిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. మూడు దఫాలలో పోటీ చేసిన అభ్యర్థులంతా ఖర్చుల వివరాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్, గెలిచిన సందర్భంలో ఎన్నికల్లో చేసే ఖర్చును సకాలంలో సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డగోలుగా ఖర్చు చేసిన అభ్యర్థులు నిబంధనల ప్రకారం ప్రతి రూపాయి లెక్క చూపాల్సి ఉంటుంది. లేదంటే అనర్హత వేటుపడే ప్రమాదం ఉంది. ఖర్చు చేయడం ఒక ఎత్తైతే దానిని నిబంధనల ప్రకారం చెప్పడం తలకు మించిన భారం కావడంతో అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. కాగా వ్యయ వివరాలు సమర్పించేందుకు 45 రోజుల గడువు విధించారు.
సమర్పించకపోతే వేటే
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు వారి గుర్తులు కేటాయించిన రోజు నుంచి ఫలితాలు వెలువడే వరకు చేసిన ఖర్చు వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలి. లేదంటే చట్టం ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన వారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. సర్పంచ్ ఎన్నికలలో ఓడి, రానున్న ఎన్నికల్లో టికెట్టు ఆశించే అవకాశం ఉంది. త్వరలోనే పార్టీ గుర్తులపై జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జరగనున్నందున అభ్యర్థులు జాగ్రత్త పడాల్సి ఉంది.
Read Also- Anasuya: అనసూయ సంచలన నిర్ణయం.. కరాటే కళ్యాణి, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు
మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు
జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. మొదటి విడతలో 106, రెండవ విడుదల 74,మూడో విడతలో 75 స్థానాల్లో ఎన్నికలను ప్రకటించారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలను మినహాయించి మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే సర్పంచులు, పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేయగా నెలకోసారి పాలక వర్గ సమావేశం, రెండు నెలకోసారి గ్రామ సభ నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్ లు, లెక్కలు పూర్తి చేయకపోవడం, అవినీతికి పాల్పడినా పదవీ కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సర్పంచులకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
ఎంపీడీవోలకు అందజేత
సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు అందజేసి రసీదు తీసుకోవాలి. ఆపై వివరాలను సైట్ లో 45 రోజుల లోపు నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా 5 వేల లోపు జనాభా ఉన్న జిపిల్లో సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థి గరిష్టంగా రూ 1.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. వార్డు సభ్యులైతే 30 వేల వరకు ఖర్చు చూపించవచ్చు. ఇక ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ 2.50 లక్షల వరకు, వార్డు సభ్యులు 50వేల వరకు ఖర్చు చేసే అవకాశం ఉండగా పూర్తి వివరాలతో లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది.
Read Also- Google Search Trends 2025: గూగుల్ సెర్చ్ 2025లో అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?..

