స్వేచ్ఛ మహబూబ్ నగర్: MLA Srinivas Reddy: మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మహబూబ్ నగర్ ఫస్ట్ అనే విరుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత బి ఆర్ ఎస్ ఏలికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా విధ్వంసానికి గురైందన్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళుతున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలోనే తమ అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలో 64 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఉద్యోగ ప్రకటన వెలువడగానే వేలాది మంది అభ్యర్థులు హైదరాబాద్ లాంటి నగరాలకు వేలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ లకు వెళ్తున్నారని అలాంటివారికి ఉచితంగానే కోచింగ్ ఇప్పించాలనే సంకల్పంతో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ ను సంప్రదించి తమ సంస్థ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉచిత కోచింగ్ ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.
తన అభ్యర్థన విన్న వెంటనే రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రియాజ్ సానుకూలంగా స్పందించి, కోచింగ్ ఇప్పించడానికి గతంలో అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసిన నిష్ణాతులైన ఫ్యాకల్టీని సైతం సమీకరించి జిల్లా కేంద్రంలో కోచింగ్ ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఏప్రిల్ 16 నుండి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కోచింగ్ తరగతులు ప్రారంభించనున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలన్నీ సంప్రదించి దరఖాస్తులు అందజేయాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అనంతరం తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.
Also Read: Khammam Priest: ఖమ్మంలో కుల వివక్షత.. జంజం లేదంటే పూజ చేయనన్న పురోహితుడు
మహబూబ్ నగర్ లో ఇప్పటికే ఏర్పాటుచేసిన విద్యా నిధికి ఎంతోమంది స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని, ఆ విరాళాలను ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించబోతున్నట్లు తెలిపారు. మహిళల్లో నైపుణ్యాలను వృద్ధిపరిచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని లక్ష్యంతోనే సెట్విన్ సంస్థ సౌజన్యంతో, తన సొంత ఖర్చులతో 250 మంది మహిళలకు వివిధ రంగాలలో శిక్షణను ఇప్పించడం జరిగిందన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు వ్యాపారాలు ప్రారంభించుకునే విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు సైతం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే మరో 250 మంది మహిళలు ఆయన రంగాల్లో శిక్షణను తీసుకుంటున్నట్లు తెలిపారు. యువతలో నైపుణ్యాలను పెంపొందింపజేసి వారిని ఉత్తమ మానవ వనరులుగా శిల్పికరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు నీట్, ఐఐటి పరీక్షల కోసం ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించినట్లు తెలిపారు. సమీప భవిష్యత్తులో టెట్, డీఎస్సీ, వీఆర్వో, వీఆర్ఏ తదితర ఉద్యోగాల కు సైతం ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్
ఒక దేశ భవిష్యత్తును పరిపూర్ణంగా మార్చగలిగేది కేవలం విద్య మాత్రమే అన్న సత్యాన్ని ఆకలింపు చేసుకున్న నేతగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో తమ ప్రాంత యువతకు ఉచిత కోచింగ్ ఇప్పించాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తనను కోరిన వెంటనే అంగీకరించినట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుండి యెన్నం తనకు సుపరిచితుడనీ, ఉద్యమ కాలంలో ఈ కమీట్ మెంటుతో పనిచేశారో, అదే కమిట్ మెంట్ తో శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా ఈ ప్రాంత యువత భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆలోచనలోంచి ప్రభవించిన మహబూబ్ నగర్ ఫస్ట్ విజయవంతమై త్వరలోనే అద్భుతమైన ఫలితాలను మన ముందు ఉంచుతుందన్నారు. ఈ తరహా కృషి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఫ్యాకల్టీ బృందం తదితరులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/