Gadwal Protest: పచ్చని పల్లెల్లో ప్రమాదకర ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సారవంతమైన పొలాలు, పక్కనే తుంగభద్ర నదీతీరాన ప్రశాంతమైన వాతావరణంలో 14 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ అహ్లాదకరమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ నిర్మాణంతో ఆ సమీప గ్రామాల ప్రజలు, రైతులకు ఇథనాల్ కంపెనీ నిర్వహణ వల్ల వచ్చే కలుషిత నీటితో పచ్చని పొలాలు, పల్లెలు, నదిని కలుషితం చేసే ఫ్యాక్టరీ మాకొద్దంటూ ఆందోళనకు సిద్ధమయ్యారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ పేరు వినగానే రైతులు ఉలిక్కి పడుతున్నారు. గాలి, నీరు, తినే పంటలను కలుషితం చేసే ఫ్యాక్టరీ మాకొద్దంటూ రాజోళి మండలం పెద్ద ధన్వాడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా పర్యావరణం, ప్రజారోగ్యం మరియు వ్యవసాయం మీద ప్రభావం చూపిస్తాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగి, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితమై, వ్యవసాయం కూడా దెబ్బతింటుంది.
ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల కలిగే దుష్ప్రభావాలు
ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే రసాయనాలు, పొగ మరియు ఇతర కాలుష్యాలు గాలి, నీరు మరియు నేలను కలుషితం చేస్తాయి. కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్ల వ్యవసాయం దెబ్బతింటుంది మరియు పంటలు నాశనం అవ్వడమే కాక సారవంతమైన పొలాలు దెబ్బతినే అవకాశం ఉందని స్థానిక రైతులు వాపోతున్నారు.
Also read: AP Constable Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాలపై కీలక ప్రకటన.. మీరు సిద్ధమేనా!
కలుషితమైన నీరు, గాలి పశువుల ఆరోగ్యం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యం దెబ్బతిని మానవుడి మనుగడకే ప్రమాదమని భవిష్యత్తును తలుచుకొని రైతులు ముకుముడిగా ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేసుకొని ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపట్టారు.
రైతుల అభిప్రాయం తీసుకోకుండానే
జోగుళాంబ గద్వాల జిల్లాలో గాయత్రీ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతో 30 ఎకరాలలో రూ.189 కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, ప్రజా అభిప్రాయాలు సేకరించకుండా.. కంపెనీ ఏర్పాటు కు సన్నాహాలు చేస్తుండడం అందుకు సంబంధించిన రోడ్డు, పోల్స్ పాతడం, విద్యుత్ పనులు చేయగా ప్రభావిత 14 గ్రామాల ప్రజలు అడ్డగించి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నిత్యం ఆందోళనలు చేయడంతోపాటు కలెక్టర్, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానికులకు తెలియకుండా కంపెనీ నిర్మాణం కోసం అడపదడపా పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తుంగభద్ర నది నుంచి కంపెనీకి నీటి కేటాయింపులు కూడా చోటు చేసుకోవడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేశారు.
కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు రాజోళి తహసీల్దార్ రామ్మోహన్ రైతులకు సమాచారం ఇచ్చి కంపెనీ అనుమతులపై జిల్లా కేంద్రంలో ఆర్డీవో తో సమావేశం కావాలని తెలపడంతో 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఆర్డీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యంతో ప్రజలకు దాదాపు మూడు గంటల పాటు అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా వారు మాత్రం కంపెనీ వద్దంటే వద్దని తిరస్కరించారు.
Also read: Indus Waters Treaty: పాకిస్తాన్ లో అమ్మో.. అయ్యో రేంజ్ కేకలే.. కారణం ఇదే
కంపెనీ ఏర్పాటు వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అగ్రిమెంట్ కూడా చేయిస్తామని రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించినా రైతులు అందుకు అంగీకరించలేదు. ప్రజల ప్రాణాలను, పంట భూములను నాశనం చేసుకునే పరిస్థితి లేదని, కంపెనీ కోసం అని చెప్పకుండా.. మోసం చేసి కొన్న భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు తాగునీరు, సాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే ఫ్యాక్టరీలకు నీరు ఎలా అంది స్తారని అధికారులను నిలదీశారు.
రైతుల అభిప్రాయాలు
1.కంపెనీ నిర్మాణం చేపటవద్దు : జయరామిరెడ్డి, రైతు,పెద్ద ధన్వాడ
ఇథనాల్ కంపెనీ నిర్మాణంతో మా ప్రాంత భూములు దెబ్బతినడమే గాక నీరు, పర్యావరణం కలుషితమవుతుంది. ప్రతి ఏటా నేను 20 ఎకరాలలో వరిపంట సాగుచేస్తున్నాను. కలుషిత నీటితో పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను కంపెనీ నిర్మాణాన్ని అంగీకరించం.
2– నారాయణ, మాజీ సర్పంచ్, చిన్నధన్వాడ
మా అభిప్రాయం తీసుకోకుండా ఇథనాల్ కంపెనీ నిర్మాణానికి భూమి సేకరించారు. నిర్మాణం ఐతే మా ప్రాంత ప్రజలు వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది. నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి
3.నిర్మాణం ఐతే ప్రజల ప్రాణాలకే ముప్పు : వీరేష్ గౌడ్, పెద్ద ధన్వాడ
గత ఐదు నెలలుగా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజలు, రైతుల అభిప్రాయం మేరకు ఇథనాల్ కంపెనీ నిర్మాణం చేపట్టకుండా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తాం.