Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా వాకిటి శ్రీహరి నియామకం
గత ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్
పట్టణ పరిధిలో బలంగా కనిపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు
పార్టీ విజయవకాశాలను దెబ్బతీస్తున్న గ్రూప్ విభేదాలు
నేతలంతా సమన్వయంతో ముందుకెళ్తేనే చేతికి మున్సిపాలిటీ పగ్గాలు
గద్వాల, స్వేచ్ఛ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్లమెంటు ఎన్నికలు, ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరగగా, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరగనున్నాయి. ఇవి హస్తం పార్టీకి ప్రతిష్టాత్మక మారనున్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల్లో మల్లు రవి విజయం సాధించగా, పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోను సత్తా చాటేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా మంత్రి వాకిటి శ్రీహరిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతలను చేపట్టనున్నారు. గద్వాలలో అధికార పార్టీ పక్షాన సరిత, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉండగా, అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాం రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడు, నియోజకవర్గంలోని ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ మున్సిపాలిటీలలో ఎన్నికలలో గెలుపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మున్సిపాలిటీలపై స్థానిక అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎన్నికల్లో విజయంపై ఏ విధంగా ప్రభావం చూపనున్నారనే అంశంపై చర్చ నడుస్తోంది. పార్టీకి అనాదిగా క్యాడర్ ఉన్నప్పటికీ పట్టు సాధించలేకపోతున్నారన్న విమర్శ ఉంది.
కాంగ్రెస్ కు కలిసి వచ్చేనా?
జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వార్డుల్లో గెలుపొందేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గత మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకే పరిమితం కాగా అధిక స్థానాలతో 4 మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి పార్టీ అధికారంలోకి రావడం కొంత అనుకూలంగానే కనిపిస్తున్న నాయకత్వ లోపం, వర్గ విభేదాలు, అలంపూర్ నాయకుడి వరుస వివాదాలు కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
Read Also- Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు
ఎవరి దారి వారిదే
కాంగ్రెస్ నేతలు ఎవరి దారి వారిదే కావడంతో పార్టీ శ్రేణులు ఎటువైపు మొగ్గు చూపాలో అర్థం పరిస్థితి నెలకొంది. జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరిత వర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో అధిక స్థానాలలో పాగా వేయాలని చూస్తుండగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తనకున్న పార్టీ క్యాడర్, వ్యక్తిగత అనుచరుల మద్దతుతో మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ధీమాతో అభ్యర్థి ఎంపికపై జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలలో బీఫామ్ లో తన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీ పెద్దలు మాత్రం గద్వాల మున్సిపాలిటీలోని 37 వార్డులకు ఇరు వర్గాలకు సమానంగా ఇవ్వాలనే ప్రతిపాదన తీగ ఇస్తే అన్ని వార్డులకు బి ఫామ్ లో తనకే ఇవ్వాలని లేని పక్షంలో నా అభ్యర్థులను బరిలో దింపి గెలిపించుకుంటానని సంబంధిత నాయకులతో అన్నట్లు చర్చ నడుస్తోంది. జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వాకిటి శ్రీహరి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ గెలుపు దృష్ట్యా విభేదాలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ప్రతిపక్ష పార్టీల దూకుడు
గద్వాల మున్సిపాలిటీ తో పాటు మిగతా మూడు మున్సిపాలిటీలలో టిఆర్ఎస్ నాయకత్వం సైతం బలంగా ఉంది. గత మున్సిపాలిటీ ఎన్నికలలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ లుగా పాలించారు. అలంపూర్, వడ్డేపల్లి ఎస్సీ మహిళ కాగా ఐజ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎస్సీ జనరల్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాం రెడ్డి చైర్మన్, వార్డు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో ఆయన ఎన్నికలపై దృష్టి సారిస్తే విజయవకాశాలు ఆ పార్టీకి మెండుగా ఉండే అవకాశం ఉందని ప్రజల్లో చర్చ నడుస్తోంది. వరుస వివాదాలతో అధికార పార్టీకి తలనొప్పిగా మారిన సంపత్ కుమార్ ఈ ఎన్నికలపై ఆయన వ్యూహం ఎలా ఉంటుందోనని ప్రజలు భావిస్తున్నారు.
క్రియాశీలక పాత్ర పోషించనున్న బీజేపీ
సాధారణ, స్థానిక ఎన్నికలతో పోలిస్తే మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలు బిజెపి పార్టీకి మద్దతు ఇస్తారని అభిప్రాయం ప్రజల్లో ఉంది. పార్టీ తరపున డీకే అరుణ ఉండడంతో గత గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో 12 మంది వార్డ్ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. బిజెపి పార్టీ మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అలంపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఐజ, అలంపూర్,వడ్డేపల్లి మున్సిపాలిటీలలో పార్టీ పట్ల ప్రజల్లో ఏ మేరకు మద్దతు దొరుకుతుంది అనేది ఎన్నికల్లో తేలనుంది.
Read Also- Viral Video: అగ్గిపెట్టెంత ఇల్లు.. రూ.1.2 కోట్లు అంట.. కొనేవాళ్లు మరీ అంత పిచ్చోళ్లా!

