Kishan Reddy: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ స్టేట్ చీఫ్ అధ్యక్షుడు రాంచందర్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వారిని సన్మానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో సర్పంచ్‌గా గెలవాలంటే ఎంతో పట్టుదల కావాలన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆ పట్టుదల ప్రతి కార్యకర్తలో కనిపించిందని కొనియాడారు.
ఎన్నికల్లో మంచి ఫలితాలు
బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన తెలంగాణ(Telangana) ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచిన ఘనత మోదీదేనన్నారు. వచ్చే ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయని, ప్రజలు బీజేపీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సమన్వయంగా ఒక కార్యాచరణతో ప్రతి కార్యకర్త ముందుకువెళ్లాలన్నారు. ఆ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించే రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. 10 మది ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా కాంగ్రెస్‌లోకి వెళ్లారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఇదే తంతు కొనసాగిందని ధ్వజమెత్తారు.
Also Read: Bigg Boss9 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన ‘ది రాజాసాబ్’ హీరోయిన్.. హారర్ర్ ఎవరంటే?
సర్పంచ్‌లు అప్రమత్తం
పార్టీ మారలేదని సిగ్గు లేకుండా చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రెండు పార్టీలు సిగ్గుపడాలని చురకలంటించారు. రాజ్యాంగ పదవిలో ఉండి స్పీకర్ ఏ రకంగా తీర్పు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు లేదన్నారు. సర్పంచ్‌లను మభ్యపెట్టే ప్రయత్నం రెండు పార్టీలు చేస్తాయని, సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా అభ్యర్థుల గెలుపులో కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. అందరూ తలెత్తుకు తిరిగేలా కార్యకర్తలు పనిచేశారని కొనియాడారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎదురొడ్డి సర్పంచులను గెలిపించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Also Read: Google Alert: దయచేసి అమెరికా వదిలి వెళ్లకండి.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఎందుకంటే?

