Adulterated liquor: కారేపల్లిలో వెలుగులోకి వస్తున్న కల్తీ మద్యం ముఠా అక్రమాలు
కాపాడే ప్రయత్నంలో ఎక్సైజ్ అధికారులు
కారేపల్లి, స్వేచ్ఛ: ఖమ్మం జిల్లాలోని కారేపల్లి కేంద్రంగా కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ఖాకీ ముసుగులో కల్తీ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తి వ్యవహారాన్ని ఎక్సైజ్ అధికారులు బట్ట బయలు చేసినట్టే చేసి.. అతడిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారేపల్లిలోని శ్రీ కనకదుర్గ వైన్‌షాప్ యజమాని తన నివాసం ఉండే తండాలో, తన ఇంటి వద్ద బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తుంటాడు. శుక్రవారం ఎక్సైజ్ అధికారులు శ్రీ కనకదుర్గ వైన్స్ యజమాని ఇంట్లో తనిఖీలు చేసి 30 బాటిళ్ల అక్రమమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులోని 16 బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కల్తీ మద్యంగా గుర్తించారు. ఎక్సైజ్ అధికారుల వద్ద ఉండే ఓ కిట్ ద్వారా ప్రాథమికంగా మద్యాన్ని తనిఖీ చేసి నకిలీ మద్యాన్ని గుర్తించే సౌలభ్యం ఉంది. ఈ పరికరం ద్వారా గుర్తించినప్పటికీ ఎక్సైజ్ అధికారులు యజమానిని కాపాడడం కోసం చేయరాని పొరపాట్లన్నీ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Read Also- Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ నేతల హౌస్ అరెస్ట్.. ఓపెన్ మెరిట్ విద్యార్థుల ఆందోళనలో కొత్త మలుపు
ఇంటి యజమానిని వదిలి అతని భార్యపై కేసు ఎందుకు పెట్టారు?
కారేపల్లి ఎక్సైజ్ అధికారు లు శ్రీ కనకదుర్గ వైన్స్ షాప్ యజమాని ఇంట్లో కల్తిమద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇంటి యజమానిపై కేసు పెట్టకుండా అతడి భార్యపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఇంటి యజమాని పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు కాబట్టి అతడిని కాపాడటం కోసమే అతడి భార్యపై కేసు నమోదు చేసి ఎక్సైజ్ శాఖ కూడా అక్రమంలో భాగస్వామ్యం అయిందనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యం అని ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ ఒక రోజు వరకు గోప్యంగా ఉంచి రెండో రోజు కేసు నమోదు చేశామని ప్రకటించడం విచిత్రంగా ఉంది. ఆ కేసు కూడా కల్తీ మద్యం అనే విషయాన్ని ప్రస్తావించకుండా తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి వైన్ షాప్ యజమానిని కాపాడటం కోసం చేసిన ప్రయత్నాలే అని మాంసం తింటున్నామని బొక్కలు మెడలో వేసుకున్న చందంగా ఉంది.
Read Also- MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీనే దేశానికి రక్ష: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి
వైన్స్ షాపుల్లోనూ కల్తీ మద్యం..
ఖాకీ ముసుగులో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న ఈ వ్యాపారి వైన్ షాప్ కౌంటర్‌లోనే కూర్చుంటూ గత నెల రోజులుగా బహిరంగంగానే వ్యాపారం చేస్తున్నారు. ఖాకీ ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెట్టి ఈ అక్రమ వ్యాపారానికి పూర్తి సమయం కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతను నిర్వహించే వైన్ షాప్‌లో మద్యాన్ని కల్తీ చేసేందుకు ఒక ఎక్స్‌పర్ట్‌ను కూడా నియమించుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. మద్యాన్ని కల్తీ చేయడంలో నిష్ణాతుడిని నియమించుకొని కల్తీ మద్యం వ్యాపారం జోరుగా సాగిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాపారి కల్తీ వ్యాపారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినప్పటికీ కఠిన చర్యలు చేపట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేయడం కారేపల్లి మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్సైజ్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు కారేపల్లి మండలంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

