Kalvakuntla Kavitha: బీసీ కులగణనపై బీజేపీ కొత్త మోసానికి తెర లేపిందని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) అన్నారు. గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. జాతీయ స్ఫూర్తితో, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ముందుకు కదలాలని పిలుపు నిచ్చారు. బీసీల కోసం యుద్ధ భేరి మోగించబోతున్నామన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు లెక్కలు చెప్పిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సెన్సెస్ -2026 డాక్యుమెంట్ లో బీసీల క్లాసిఫికేషన్ కు ఆప్షన్ పెట్టలేదని మండిపడ్డారు.
జాగృతి యుద్ధభేరి
ఎస్సీ, ఎస్టీ, అదర్స్ గా సెన్సెస్ నిర్వహిస్తే దేశంలో బీసీల సంఖ్య ఎంత ఉందనే విషయం ఎలా బయట పడుతుందని ప్రశ్నించారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సెన్సెస్ విషయంలో చేసిన మోసాన్నే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.జనగణన విషయంలో కేంద్రం చేసిన మోసంపై తెలంగాణ జాగృతి యుద్ధభేరి మోగించబోతుందని హెచ్చరించారు. తెలంగాణలోని అన్నివర్గాల ప్రజలను సమాయత్తం చేసి ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించారని.. కేంద్రం చేయబోయే కుల గణనలోనైనా బీసీల లెక్క తేలుతుందని అందరం ఆశలు పెట్టుకున్నామని అన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన డాక్యుమెంట్ లో బీసీల కాలమ్ లేకపోవడంతో పాటు సబ్ క్యాస్ట్ ను సూచించే కాలమ్ కూడా పెట్టలేదని తెలిపారు. తద్వారా బీసీలను కేంద్ర ప్రభుత్వం అవమాన పరిచిందని అన్నారు.
తెలంగాణ జాగృతి తరపున..
బీసీలతో పాటు బీసీలలోని ఉప కులాలను, ఎస్సీ(SC), ఎస్టీ(ST)ల్లోని ఉప కులాలు, ఇతర కులాల్లోని ఉప కులాలను సైతం వేర్వేరుగా లెక్కించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన మోసంపై బీసీ మేధావులతో మాట్లాడుతున్నానని తెలిపారు. 29న నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంచార జాతులతో పాటు ఇతర కులాల్లోని అన్ని ఉప కులాల వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఒక్కో కులంలో ఎంత శాతం మంది ఉన్నారు.. ఉప కులాల్లో ఎందరు ఉన్నారు అనే డాక్యుమెంట్ తయారు చేసి తెలంగాణ జాగృతి తరపున కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. బీసీల గణన విషయంలో కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణపై స్టేట్ బాడీ నాయకులతో కవిత సమావేశం అయ్యారు. కేంద్రం నిర్వహించే జనగణనలో బీసీల కాలమ్ లేకపోవడం, సబ్ క్యాస్ట్ ను లెక్కించే కాలమ్ లేకపోవడం సహా జనగణనలో ఆయా కులాల డిమాండ్లపై రౌండ్ టేబుల్ సమావేశం లో చర్చించి కేంద్రానికి నివేదించనున్నట్లు తెలిపారు.
Also Read; V. C. Sajjanar: ‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం!

