Telangana Politics: తెలంగాణ శాసనసభ, శాసన మండలి వేదికగా రాజకీయాలు మరింత హీటెక్కాయి. అధికార పార్టీ కాంగ్రెస్(Congress).. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్(BRS)ను, కేంద్రంలో అధికారంలోని బీజేపీని ఒకేసారి కార్నర్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడం గమనార్హం. మూసీ ప్రక్షాళన మొదలుకొని ఉపాధి హామీ పథకం పేరు మార్పు వరకు, ప్రతి అంశంలోనూ గత ప్రభుత్వ తప్పిదాలను, కేంద్ర వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ సభ్యులు సభలో పట్టు సాధిస్తున్నారు. రెండు పార్టీలపై ఏకకాలంలో దాడి చేస్తూ ప్రతిపక్ష సభ్యులకు చుక్కలు చూపిస్తున్నారు. సాధారణంగా సభలో అధికార పార్టీ కేవలం ప్రధాన ప్రతిపక్షంపైనే అత్యధికంగా విమర్శలు గుప్పిస్తుంది. కానీ, ప్రస్తుత సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం భిన్నంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ఎక్కు పెడుతూ ఎదురుదాడి చేసింది. గత పదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ప్రాజెక్టుల వైఫల్యాలను ఎండగడుతూ గులాబీ దళాన్ని రక్షణలో పడేసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఉపాధి హామీ పథకంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ కమలం పార్టీని ఇరకాటంలో పెడుతున్నది. సభలో చర్చకు వస్తున్న ప్రతి అంశంపై ప్రభుత్వం పక్కా ఆధారాలతో ప్రతిపక్షాలను ఇరకాటంలో పెడుతుండటం ఆ పార్టీ సభ్యులు జీర్జించుకోలేని పరిస్థితి నెలకొన్నది. సోషల్ మీడియాల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరుపై విమర్శలు వర్షం కురుస్తున్నది. సవాల్ విసిరి సభలో లేకుండా బాయ్ కాట్‌లు, సభ నుంచి వాకౌట్‌లు ఎందుకని? సోషల్ మీడియాలోనూ ఆ రెండు పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఉభయ సభల్లోనూ క్లారిటీ..?
ఇక మూసీ నదిని మురికి కూపంగా మార్చింది గత ప్రభుత్వమేనని, ఇప్పుడు దాన్ని బాగు చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు మద్ధతు ఇస్తుంటే, బీఆర్‌ఎస్ పార్టీ డ్రామాలు చేస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ కురిపి కంటే బీఆర్‌ఎస్ నేతల కడుపుల్లోనే ఎక్కువ విషయం ఉన్నదని సీఎం విమర్శిస్తూ.. రెండు పార్టీల మధ్య రాజకీయ దుమారాన్ని మరింత పెంచారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకమైన ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం వైఖరిని, దానికి రాష్ట్ర బీజేపీ నేతల మద్దతును కాంగ్రెస్ తప్పుబడుతున్నది. పేదల పొట్ట కొట్టే ఈ విధానాన్ని మార్చుకోవాలని అసెంబ్లీ, కౌన్సిల్ రెండు సభల్లోనూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసింది. పేదల పొట్ట కొట్టి కార్పొరేట్లకు పెద్దపీట వేయడానికి కాంగ్రెస్ వ్యతిరేఖమంటూ సర్కార్ ఉభయ సభల్లోనూ తేల్చి చెప్పింది. ఇక కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల్లో జరిగిన సాంకేతిక లోపాలను గణాంకాలతో సహా సభ ముందు ఉంచడంలో ప్రభుత్వం సఫలమైందనే చర్చ జరుగుతున్నది.
Also Read: Thalaivar 173: రజనీకాంత్ ‘తలైవార్ 173’ కి దర్శకుడు ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
కాంగ్రెస్ సభ్యుల్లో పెరిగిన విశ్వాసం..
గతంలో ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇవ్వడానికే పరిమితమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎదురుదాడిలో ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరిస్తుండటంతో అధికార పక్షంలో కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. ముఖ్యంగా యువ ఎమ్మెల్యేలు సభలో గట్టిగా గళం విప్పుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రతీ అంశంలో కౌంటర్ ఇచ్చేందుకు యువ ఎమ్మెల్యేలు ఆసక్తి కనబరచడం విశేషం. అయితే, ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ‘డబుల్ ఎటాక్’ వ్యూహంతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీఆర్ఎస్ తమ పాత పథకాలను సమర్థించుకోలేక, కొత్త విమర్శలు చేయలేక సతమతమవుతున్నది. ఇక బీజేపీ కూడా కేంద్రం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు సభలో కంటే బయటే ప్రెస్‌మీట్లు, స్పీచ్‌లు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ రాజకీయ చాతుర్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగులోనూ ప్రతిపక్షాలను నిలువరించడంలో పైచేయి సాధిస్తున్నదని పొలిటికల్ సర్కిళ్లలో చర్చాంశనీయమైంది.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్..?

