CM Revanth Reddy: హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
Also Read: Notice to Sunitha Rao: మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావుకు షోకాస్ నోటిసులు..!
హైదరాబాద్ నగరం పై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
సంస్థల సమన్వయం కీలకం
జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.
Also Read: Phone Tapping Case: ప్రభాకర్ రావుకు బిగుసుకుంటున్న ఉచ్చు.. అదే జరిగితే ప్రభాకర్ రావు ఆస్తులు సీజ్!
ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు సిద్ధం….
మరోవైపు ఈ నెలాఖరులోగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని, దీనితో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, ఏవిధమైన విపత్తులు జరుగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో మే మాసాంతం వరకే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో జిల్లాలకు ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తగు మార్గదర్శకాలను విడుదల చేశారు.
2024 ఆగస్టు మాసంలో వచ్చిన భారీ వర్షాలతో సకాలంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేరుకోక పోవడంతో జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందస్తుగానే ఈసారి 12 స్టేట్ డిసాస్టర్ రిలీఫ్ ఫోర్స్ లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఒక్కో టీమ్ లో తెలంగాణా స్పెషల్ పోలీస్ కు చెందిన 100 సుశిక్షితులైన పోలీసులు ఉంటారని, ఈ బృందాలను రాష్ట్రంలోకి పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేశామని చెప్పారు. తద్వారా, ఎక్కడైనా భారీ వర్షాలు, తుఫానులు వచ్చినా, వెంటనే సమీపంలోని ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు చేరుకుంటాయని కలెక్టర్లకు వివరించారు. దీనితో పాటు, ఈ సారి 3 ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు వచ్చే జిల్లాల్లో ఈసారి ప్రత్యేకంగా అదనపు బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు.
Also Read: Crime News: మహిళా డాక్టర్‌పై.. మరో డాక్టర్ అత్యాచారం!
ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న అన్ని ఫైర్ స్టేషన్లలో ఫైర్ సిబ్బందికి ప్రత్యేకంగా విపత్తుల నివారణ చర్యలపై శిక్షణను ఇప్పించామని అన్నారు. హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాలకు తక్షణమే స్పందించేలా హైడ్రా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాలు, ఆకస్మిక వర్షాలు వస్తే నష్టాలను తగ్గించడానికి పై చర్యలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశముంటే, సంబంధిత జిల్లాలకు కేటాయించిన ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ ఎఫ్ బృందాలతో టచ్ లో ఉండాలని ఆయా బృందాల వివరాలు సంబంధిత అధికారులకు కూడా ఇవ్వాలని సూచించారు.
అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల ఫైర్ ఆఫీసర్లతో సంప్రదిస్తూ, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ సేవలను పొందాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ఎఫ్ సేవలు కావాలంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖతో టచ్ లో ఉండాలని పేర్కొన్నారు. విపత్తుల నివారణలో సుశిక్షితులైన సింగరేణి కాలరీస్ సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. తమ జిల్లాలోని వరదలు, వర్షాల వల్లముంపు ప్రాంతాలు, ఇతర సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక ద్రుష్టి సాధించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు