HILT Policy: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట
HILT Policy (imagecredit:twitter)
Political News, Telangana News

HILT Policy: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట.. అందుకు ప్రణాళికలు సిద్ధం

HILT Policy: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్(BRS) పోరుబాటపడుతుంది. ఈ పాలసీతో రూ. 5లక్షల కోట్ల కాంగ్రెస్ పార్టీ భూ కుంభకోణంకు పాల్పడుతుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ నెల 3, 4 తేదీల్లో పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజనిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. నివేదికలను రూపొందించనుంది. ఈ హిల్ట్ పాలసీపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. అందుకోసం పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది.

మార్కెట్ విలువ కంటే తక్కువ

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(హిల్ట్ పాలసీ) పేరుతో హైదరాబాద్(Hyderabad) మహానగర పరిధిలోని 5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్(BRS) సిద్ధమైంది. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపిస్తుంది. సుమారు 9,300 ఎకరాల భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్.ఆర్.ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మండిపడుతుంది. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని దానిని అడ్డుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించారు. పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. 

Also Read: Panchayat Elections: వేడెక్కుతున్న పల్లె రాజకీయం.. సర్వశక్తులు ఒడ్డుతున్న ఆశావహులు

జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో..

ఈ నెల 3, 4 తేదీలలో హెచ్ఐఎల్టీపీ స్కామ్ పై నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 8 బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. క్లస్టర్-1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ , మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శిస్తారు. క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. క్లస్టర్-3కు సంబంధించి ఎమ్మెల్సీ మధుసూదనాచారి(MLC Madhusudhanachari) నేతృత్వంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy), ఎమ్మెల్సీ రవీందర్ రావు మౌలాలి(MLC Ravinder Rao Moulali), కుషాయిగూడ పారిశ్రామిక వాడలను విజిట్ చేయనున్నారు. క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేతృత్వంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavati Rathod), ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy), మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao), కేపీ వివేకానంద తో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. క్లస్టర్-5లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్-6లో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నాయకుడు కార్తీక్ రెడ్డి కాటేదాన్ , హయత్ నగర్ లో పర్యటిస్తారు. క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, నాయకులు ఎండీ సలీం, చందులాల్ బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి వివరాలను ప్రజల నుంచి సేకరిస్తారు.

9వేల ఎకరాల భూమిని..

క్లస్టర్లలో గత ప్రభుత్వాలు కంపెనీల కోసం ఎంత భూమిని కేటాయించారు.. ప్రస్తుతం భూమికి మార్కెట్ రేట్ ఎంతా? అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎంతమంది ఉపాధి అవకాశాలు వస్తాయనేది స్థానిక ప్రజల నుంచి వివరాలు తెలుసుకుంటారు. అన్ని వివరాలను నివేదిక రూపంలో అందజేసి పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు అందజేయనున్నారు. మరోవైపు ప్రభుత్వం 9వేల ఎకరాల భూమిని విక్రయించి 5లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుందనే అంశాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్రభుత్వ భూములను ప్రైవేటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ధారదత్తం చేస్తుందని విస్తృతంగా ప్రచారం చేయబోతున్నట్లు సమాచారం. అంతేగాకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. అవినీతి అనే అంశాన్ని బలంగా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతుంది.

నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

హిల్ట్ పాలసీని అస్త్రంగా చేసుకొని ప్రజలముందుకు వెళ్లాలని, ప్రభుత్వ అవినీతిని వివరించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో క్షేత్రస్థాయి పర్యటనలపై పలు సూచనలు చేశారు. హిల్ పాలసీతో కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల కుంభకోణం నిజా నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని సూచించారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని అందుకు ప్రజలను సన్నద్ధం చేయాలని సూచించారు. క్లస్టర్ల పర్యటనలో ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో అందజేయాలని సూచించినట్లు తెలిసింది. ఇదే అస్త్రంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Uttar Pradesh: పెళ్లైన మర్నాడే భార్యపై వేధింపులు.. బయటకు గెంటేసిన భర్త.. ఎందుకంటే?

Just In

01

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!