Bonalu Festival 2025: నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే.. ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్ (Hyderabad) నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం. అనుకోని విపత్తుల నుంచి తమను కాపాడాలంటూ ఆదిశక్తి రూపాలకు బోనాలు సమర్పించి వేడుకోవడం నగరంలో 4 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల ఉత్సవాలు (Bonalu Festival 2025) నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించినది.
దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. నెల రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్లను చేసింది. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. బోనాల సందర్భంగా ప్రభుత్వం ప్రముఖ దేవాలయాలకు పట్టువస్త్రాలు సమర్పించనుంది.
ఆషాఢ బోనాలకు ప్రభుత్వం కేటాయించే నిధుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి రూ. 5 కోట్లు అధికంగా నిధులు కేటాయించగా, మరో రూ. 10 కోట్లకు దేవాదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
Also Read: TG Badi Bata Program: మూతబడిన138 స్కూళ్లు రీ ఓపెన్.. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి!
పారదర్శకంగా నిధులు..
ప్రతి ఏటా ప్రభుత్వం ఆషాఢ బోనాలను ఘనంగా నిర్వహిస్తుంది, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలో ఈ పండుగను వైభవంగా జరుపుకొంటారు. ఈసారి ప్రభుత్వం రూ. 20 కోట్లను కేటాయించింది. ఆలయం ప్రాముఖ్యతను, ఆలయాలను బట్టి దేవాదాయ శాఖ బోనాల ఏర్పాట్ల కోసం నిధులు కేటాయిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, నీటి వసతి, బారికేడ్లు, ఆలయ అలంకరణ తదితర మౌలిక సదుపాయాలకు ఈ నిధులు ఉపయోగపడతాయి. ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిధులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గత లోపాలకు అడ్డుకట్ట..
గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకొని దేవాదాయ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. గతంలో ఇంట్లో గుడి ఉన్నా దరఖాస్తు చేసుకుంటే ఆషాఢ బోనాల సందర్భంగా నిధులు కేటాయించినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. నిధులు పక్కదారి పట్టకుండా, ఈసారి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాతనే మంజూరు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ప్రత్యేకంగా అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు. గోల్కొండ జాతర, బల్కంపేట ఎల్లమ్మతల్లి వార్షిక కల్యాణోత్సవం, లష్కర్, లాల్ దర్వాజ బోనాలు, అమ్మవారి అంబారి ఊరేగింపు, రంగం కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
క్షేత్రస్థాయి పరిశీలన..
ఆషాఢ బోనాల పండుగను పురస్కరించుకొని నిధుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే నిధులకు సంబంధించిన చెక్కులను ఆలయ కమిటీకి లేదా నిర్వాహకులకు అందజేస్తుంది. అసలు దరఖాస్తు చేసుకున్న ఆలయాలు ఉన్నాయా, ఆ ఆలయాలకు ఎంతమంది భక్తులు వస్తారు, ఆలయ ప్రాముఖ్యత ఎంత, నిజంగానే ఆలయం ఉందా లేదా ఇంట్లో గుడి ఏర్పాటు చేసి నిధుల కోసం దరఖాస్తు చేసుకున్నారా వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అధికారులు ఆమోదం తెలిపిన తర్వాతే సంబంధిత ఆలయాలకు చెక్కులు మంజూరు చేస్తున్నారు.
Also Read:Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!
ఆలయాలకు నిధులు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, -రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 3442 ఆలయాలకు ఆషాఢ బోనాలకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో 1140 ఆలయాలకు రూ. 5 కోట్ల 25 లక్షల 78 వేల 400. సికింద్రాబాద్ పరిధిలో 1191 ఆలయాలకు రూ. 5 కోట్ల 66 లక్షల 50 వేల 750. రంగారెడ్డిలో 451 ఆలయాలకు రూ. కోటి 43 లక్షల 41 వేల 800. మేడ్చల్ మల్కాజిగిరిలో: 660 ఆలయాలకు రూ. 2 కోట్ల 5 లక్షల 20 వేల 500. ఇంకా 500లకు పైగా అదనపు దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చాయని, రోజుకు కొన్ని ఆలయాలకు ఆషాఢ నిధులు కేటాయించాలని దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. వీటికోసం అదనంగా మరో రూ. 10 కోట్లు ప్రభుత్వం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 15 కోట్లు మాత్రమే కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా మరో రూ. 5 కోట్లు కేటాయించి మొత్తం రూ. 20 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.
ఏపీ నుంచి ఏనుగు..
ప్రతి ఏటా ఆషాఢ బోనాలను పురస్కరించుకొని అమ్మవారి ఊరేగింపు కోసం ఏనుగును కర్ణాటక నుంచి తీసుకొస్తారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏనుగును తీసుకొస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఏపీకి దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏనుగును బోనాలు, మొహర్రం ఊరేగింపులలో వినియోగించి ఆ తర్వాత తిరిగి ఆ రాష్ట్రానికి పంపించనున్నారు.
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం, మంత్రులు
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు-2025 సందర్భంగా వివిధ ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం, మంత్రులు, ముఖ్య నేతల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.
❄️ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఉజ్జయిని మహంకాళి ఆలయం, సికింద్రాబాద్.
❄️ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క: సింహవాహిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజ, హైదరాబాద్.
❄️మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి: మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం, నాచారం, ఉప్పల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
❄️మంత్రి దామోదర రాజనర్సింహ: దర్బార్ మైసమ్మ ఆలయం, కార్వాన్.
❄️మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి: భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్.
❄️మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు: అక్కన్న మాదన్న ఆలయం, హరి బౌలి.
❄️పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: కట్టమైసమ్మ ఆలయం, చిలకలగూడ, సికింద్రాబాద్.
❄️మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్: ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం, బల్కంపేట.
❄️మంత్రి తుమ్మల నాగేశ్వరరావు: నల్లపోచమ్మ ఆలయం, సబ్జిమండి.
❄️మంత్రి సీతక్క: ఖిలా మైసమ్మ ఆలయం, ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్.
❄️మంత్రి జూపల్లి కృష్ణారావు: మహంకాళి ఆలయం, మీరాలంమండి.
❄️మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి: ముత్యాలమ్మ ఆలయం, బేల.
❄️మంత్రి వాకిటి శ్రీహరి: మహంకాళి ఆలయం, గౌలీపుర (శ్రీ భారతమాత కోట మైసమ్మ ఆలయం).
❄️మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్: జగదాంబ ఆలయం, సుల్తాన్ షాహి.
❄️స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్: జగదాంబ మహంకాళి ఆలయం, గోల్కొండ కోట.
❄️శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి: మహంకాళి ఆలయం, ఉప్పుగూడ.
❄️రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్: బంగారు మైసమ్మ ఆలయం, బోయిగూడ.
❄️గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ మేయర్: బంగారు మైసమ్మ ఆలయం, హరి బౌలి.
❄️శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్: మహంకాళి ఆలయం, అంబర్‌పేట.
❄️డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్: దర్బార్ మైసమ్మ ఆలయం, అలియాబాద్ – జాటోథ్.
Also Read: Harish Rao on CM Revanth: విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి!
నగరంలో బోనాల సందడి మొదలు..రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలతో రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలవుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో బోనాల సందడి నెలకొంటుందన్నారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురోగ్యాలతో జీవించాలని రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా తల్లి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తుల సదుపాయాల కోసం రూ.20 కోట్ల నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!