MP DK Aruna: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) పేర్కొన్నారు. మంగళవారం గద్వాలలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధమయ్యారని ఆమె తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. పదేండ్లలో గద్వాలలో అభివృద్ది కుంటుపడిందని అన్నారు. ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఇండ్లు లేని నిరుపేదలకు స్థానిక నాయకులు అన్యాయం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు గద్వాలలోని పిల్లిగుండ్లలో 3500 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు పంపిణి చేయడం జరిగిందన్నారు.
పట్టాల కోసం ప్రవేట్ భూములను కొని..
ప్రైవేటు భూములు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి.. మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలని భావించి.. సొంత నిధులు అదనంగా ఖర్చు చేసి 75 ఎకరాల భూమి కొనుగోలు చేసి పేదలకు పట్టాలు పంపిణీ చేసినట్లుతెలిపారు. ప్రస్తుత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(MLA Bandla Krishnamohan Reddy) బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో.. కాంగ్రెస్‌లో ఉన్నారో ప్రజలకు తెలుసని అన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని స్పష్టం అవుతోందని, అభివృద్ధి కోసం అధికార పార్టీకి వెళ్ళమని అంటున్నారు. ఏం అభివృద్ధి చేశారో గద్వాల ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పంపిణీ చేసిన ప్లాట్ల పట్టాలు లాక్కొని.. డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ చూపెట్టి గద్దెనెక్కిన ఎమ్మెల్యే ఇప్పటికి ఆ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు. గద్వాలలో ఆసుపత్రికి, మెడికల్, నర్సింగ్ కాలేజికి ఆ భూమిని వినియోగిస్తున్నారన్నారు.
Also Read: Tirumala Laddu Case: లడ్డు కల్తీపై తలతిక్క వాదన.. లాజిక్ మిస్ అవుతోన్న వైసీపీ.. ఎంత లాగితే అంత చేటు!
రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
తన హయాంలో 2లక్షల ఎకరాలకుసాగు నీళ్లు అందించేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకా(Nettempadu Lift Irrigation Scheme)న్ని కొట్లాడి తీసుకువస్తే.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం తామే చేసిందని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం లేని వాళ్లకు స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గద్వాల చీరలకు మంచి వ్యాపారం ఉన్న.. చేనేత పార్కు మాత్రం ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు ఉందన్నారు.
అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలకు తెలుసు
పార్లమెంట్ ఎన్నికల్లో 21 వేల ఓట్ల బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, కుల మత బేధం లేకుండా బీజేపీని గెలిపించండన్నారు. గద్వాల అభివృద్ధి కుంటుపడటం చూస్తే బాధ కలుగుతుందన్నారు. కొట్లాడి గద్వాల జిల్లా కేంద్రాన్ని సాధించుకున్నాం అని, డబ్బులకు, ప్రలోభాలకు ప్రజలు ఓటు అమ్ముకోవద్దని సూచించారు. పని చేసే వ్యక్తులు ఎవరు అని ఆలోచింది ఓటు వేయాలని కోరారు. గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఆలోచించి పార్టీ టిక్కెట్ ఇస్తుంది అని అన్నారు. టిక్కెట్ ఎవరికి వచ్చినా అందరూ కలసి బీజేపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

