Bachupally Crime: ఈ లోకంలో వెలకట్టలేని వాటిలో తల్లిపిల్లల బంధం ఒకటి. నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డను తాను బతికి ఉన్నంతవరకూ తల్లులు కంటికిరెప్పలా కాపాడుకుంటారు. కడుపున పుట్టిన బిడ్డకు ఏ చిన్న కష్టం వచ్చిన అస్సలు తట్టుకోలేరు. అటువంటిది.. ఓ మహిళ ఏకంగా తన ఇద్దరు చిన్నారుల ఊపిరి తీసి షాకిచ్చింది. భర్తతో జరిగిన గొడవకు ఆ బిడ్డలను బలిచేసింది. ఆపై తాను ఆత్మహత్యాయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం గ్రామానికి చెందిన లక్ష్మణ్, రత్నమ్మ.. భార్య భర్తలు. ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి బాచుపల్లిలో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు మగ సంతానం. వారిలో ఇద్దరు పెద్ద పిల్లలు జగన్ (9) పవన్ (8) స్వగ్రామంలో ఉండగా.. మిగిలిన ఇద్దరు చిన్నారులు అరుణ్ (3), సుభాష్ (8 నెలలు) తల్లిదండ్రులతో బాచుపల్లిలోనే ఉంటున్నారు.
Also Read: Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు.. చవితి రోజున ఈ నైవేద్యాలు ట్రై చేయండి!
ఆ విషయంలో రోజూ వాగ్వాదం
ఇప్పటికే నలుగురు సంతానం ఉండటంతో భార్య భర్తల మధ్య ఫ్యామిలీ ప్లానింగ్ అంశం చిచ్చురేపింది. ఈ విషయమై తరుచూ వాగ్వాదానికి దిగుతుండేవారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి (ఆగస్టు 19) కూడా ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో రత్నమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. గొడవ తర్వాత రాత్రి 9 గంటలకు భర్త లక్ష్మణ్ ఇటుకలు లోడింగ్ ఉందని పనికి వెళ్లగా.. ఆమె ఎవరూ ఊహించని పని చేసింది.
Also Read: PM CM Removal Bill: లోక్ సభలో గందరగోళం.. అమిత్ షా పైకి పేపర్లు విసిరిన విపక్ష సభ్యులు!
బిడ్డలను నీటిలో ముంచి..
భర్త గొడవపడటంతో తీవ్ర కోపంతో ఉన్న రత్నమ్మ.. మధ్య రాత్రి తన వద్ద ఉన్న ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది. ఆపై తాను అందులో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో పొరుగింటి వ్యక్తి బయటకు వచ్చి గమనించి గట్టిగ అరవగా స్థానికులు చేరుకొని రత్నమ్మను బయటకు తీశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు