Komatireddy Brothers: కోమటి రెడ్డి బ్రదర్స్ మంత్రి పదవుల ఎపిసోడ్ లో ఏఐసీసీ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోన్నది. మంత్రి పదవిలో ఎవరు ఉండాలనేది నిర్ణయించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇద్దరికీ మంత్రి పదవి కష్టమేనని తేల్చి చెప్పిన హైకమాండ్.. మంత్రితో పాటు మరోకరికి కేబినెట్ ర్యాంక్ తో కూడిన ప్రాధాన్యత పదవి కేటాయిస్తామని ఏఐసీసీ చెప్పినట్లు సమాచారం. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో త్వరగా డిసైడ్ చేసుకొని హైకమాండ్ కు చెప్పాలని, ఆ తర్వాత బెర్త్ లపై క్లారిటీ ఇస్తామని ఏఐసీసీ పెద్దలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెప్పినట్లు తెలిసింది.
ఆ రూల్ వర్తించపోయినా.. చిక్కులు…?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రోజులు గడుస్తున్నా, ఇంకా కొన్ని మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఈ బెర్తుల భర్తీపై అధిష్టానం ఎప్పుడో నిర్ణయం తీసుకుంటుందని భావించినా, రకరకాల సమీకరణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. నల్గొండ జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మినిస్టర్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇద్దరికీ అర్హత ఉన్నప్పటికీ, కొన్ని ఈక్వేషన్లు కారణంగా ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే కుటుంబం – ఒకే పదవి అనేది కాంగ్రెస్ ‘ఉదయపూర్ డిక్లరేషన్’ స్పష్టం చేస్తున్నది. అయితే సీనియర్లు, విజయం వరించే అభ్యర్ధులకు మినహాయింపులు ఉంటుందనేది ఆ పార్టీ రూల్ గా పెట్టుకున్నది. కోమటిరెడ్డి బద్రర్స్ ఎపిసోడ్ లో ఈ రూల్ వర్తించకపోయినా..ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇస్తే పార్టీ లోని పరిస్థితులు ఎలా మారతాయా? అనేది చర్చంశనీయమైంది. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కు చెక్ పెట్టేందుకు ఇద్దరు అన్నదమ్ములు తేల్చుకుంటూనే బెటర్ అంటూ పార్టీ నేతలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ఢిల్లీలోనే దానం.. ఖైరతాబాద్ పై సస్పెన్స్
మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంకా ఢిల్లీలో మకాం వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం, తనకు మంత్రి పదవి గ్యారెంటీ అని భావిస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా మున్నూరు కాపు కోటాలో తనకు అవకాశం దక్కుతుందని ఆయన ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే టెక్నికల్ ఇష్యూతో సతమతమవుతున్న దానం..రాజీనామా చేసి క్లియరెన్స్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో కాంగ్రెస్ లో మంత్రి గా పనిచేసిన దానంకు ఏఐసీసీతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పరిచయాలతోనే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

